ఈ నెల 14న యాదాద్రికి సీఎం కేసీఆర్

ఈ నెల 14న (మంగ‌ళ‌వారం) ముఖ్య‌మంత్రి కేసీఆర్ యాదాద్రి (Yadadri Temple) ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా యాదాద్రి అభివృద్ధి ప‌నుల‌ను సీఎం కేసీఆర్ ప‌రిశీలించ‌నున్నారు. ఈ ఏడాది అక్టోబ‌ర్, న‌వంబ‌ర్ మాసాల్లో యాదాద్రి పుణ్య‌క్షేత్రం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం ఉండే అవ‌కాశం ఉంది. ఇటీవ‌ల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సీఎం కేసీఆర్.. యాదాద్రి ఆల‌య ప్రారంభోత్స‌వానికి రావాల‌ని ప్ర‌ధాని మోదీని ఆహ్వానించిన విష‌యం విదిత‌మే.

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను సీఎంఓ ముఖ్య కార్య‌ద‌ర్శి భూపాల్ రెడ్డి ఈ నెల 11వ తేదీన ప‌రిశీలించిన సంగ‌తి తెలిసిందే. ప్రధానాలయం లిప్టు, రథశాల, క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు. శ్రీవారి మెట్లు, శివాలయం, ప్రధానాలయం తుది మెరుగుల పనులను పరిశీలించి పనుల తీరుపై వైటీడీఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. లిప్టు, రథశాలకు మరింతగా మెరుగులు దిద్దాలని సూచించారు. ప్రసాద విక్రయ శాల వద్ద నిర్మించే ర్యాంపు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ దర్వాజలకు ఇత్తడి తొడుగులు బిగింపు ప్రక్రియ తీరును, తొడుగులు తయారీపై స్వర్ణకారులను భూపాల్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.