65 చెట్లను నరికివేసిన ఓ రియ‌ల్ట‌ర్‌కు రూ. 4 ల‌క్ష‌లు జ‌రిమానా

ఎలాంటి అనుమతి లేకుండా 65 చెట్లను నరికివేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు తెలంగాణ అట‌వీ శాఖ రూ. 4 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు పరిధిలో వెస్ట్ సైడ్ వెంచర్స్ సంస్థ ఉంది. వారి భూమి పరిధిలో ఉన్న 65 చెట్లను సంస్థ ప్రతినిధులు గత వారం ఎలాంటి అనుమతులు లేకుండా నరికివేశారు.

స్థానికులు ఫిర్యాదు చేయటంతో అటవీ శాఖ అధికారులు తనిఖీ చేశారు. చెట్లను విచక్షణారహితంగా తొలగించినట్లు నిర్ధారించారు. విచారణ చేసి వాల్టా చట్టం ప్రకారం రూ. 4 ల‌క్ష‌ల జరిమానా విధించారు. అలాగే తొలగించిన చెట్లకు బదులుగా మళ్లీ మొక్కలు నాటి, సంరక్షించాల‌ని అట‌వీ శాఖ ఆదేశించింది.