అసెంబ్లీలో జ‌మ్మి మొక్కను నాటిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోని అమ్మ‌వారి గుడికి స‌మీపంలో జ‌మ్మి మొక్క‌ను శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శ‌నివారం నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండ‌ర్, రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్, ప్రొటెం చైర్మ‌న్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. విజయానికి ప్రతీకగా భావించే జమ్మి చెట్టును నాటడం అద్భుతమైన అనుభూతిని కలిగించింది. త్రేతా యుగంలో రాముడికి నీడనిచ్చి, అరణ్యవాసంలో పాండవుల ఆయుధాలకు స్థావరంగా నిలిచిన జమ్మి చెట్టును తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్ర వృక్షంగా ప్ర‌క‌టించింది. ఇంతటి చరిత్ర కలిగిన జమ్మి చెట్టు ప్రతీ ఊరిలో ఉండాలనే తలంపుతో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారి కృషి, సంకల్పం వల్ల రాబోయే రోజుల్లో ప్రతీ ఊళ్లో జమ్మి చెట్లు అందుబాటులో ఉంటాయి. చరిత్రలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం నిలిచిపోతుంద‌ని స్పీక‌ర్ అన్నారు.