- రైతు ఆధారిత పథకాలకు సమ్మిట్ లో మేథో మథనం జరగాలి.
- పసుపు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత పసుపు బోర్డు తీసుకోవాలి
- వ్యవసాయ ఉత్పత్తులు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకం
- టర్మరిక్ వాల్యు చైన్ సమ్మిట్ -2025 లో మంత్రి తుమ్మల
హైదరాబాద్: దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమిష్టి చర్యలు అవసరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో ఈ రోజు CII తెలంగాణ మరియు నేషనల్ టర్మరిక్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన టర్మరిక్ వాల్యు చైన్ సమ్మిట్ – 2025 లో పాల్గొన్న మంత్రి, పసుపు రైతుల సంక్షేమం, విలువ జోడింపు, ఎగుమతుల అవకాశాలపై విస్తృతంగా మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన Telangana Rising Global Summit లో Agri Vision 2047 ను ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఈ విజన్‌లో వ్యవసాయాన్ని కేవలం సంక్షేమ రంగంగా కాకుండా, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజన్‌గా చూస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ అగ్రి విజన్‌లో పసుపుకి కూడా పాత్ర ఉందని మంత్రి అన్నారు. పసుపు మనకు కొత్త పంట కాదని, అది మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమై ఉందని మంత్రి అన్నారు. వంటింటికే పరిమితం కాకుండా, మెడిసిన్, న్యూట్రాస్యూటికల్స్, ఫంక్షనల్ ఫుడ్స్ వంటి రంగాల్లో పసుపు వినియోగం పెరుగుతోందని వివరించారు. మంత్రి మాట్లాడుతూ.. ““ప్రపంచవ్యాప్తంగా పసుపు సాగులో భారత్ అగ్రస్థానంలో ఉంది. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. పసుపును అధికంగా పండించే రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటి. నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆర్మూర్ పసుపుకు GI ట్యాగ్ రావడం తెలంగాణ రైతులకు గర్వకారణం” అని అన్నారు. నిజామాబాద్ రైతుల చిరకాల ఆకాంక్ష అయిన నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ, అది పూర్తిస్థాయిలో కార్యాచరణలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బోర్డు కార్యాలయ పరిమితుల్లో కాకుండా, రైతులకు పాలసీ దిశ చూపే సంస్థగా పనిచేయాలని, పరిశోధనను రైతు పొలాలకు తీసుకెళ్లాలని, మార్కెటింగ్, బ్రాండింగ్, ఎగుమతుల్లో నాయకత్వం వహించాలని కోరారు.
తెలంగాణలో అనుకూల వాతావరణం, శ్రమించే రైతులు ఉన్నప్పటికీ ధరల హెచ్చు, తగ్గుల కారణంగా పసుపు సాగు విస్తీర్ణం తగ్గడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక క్వింటా పసుపు ఉత్పత్తికి రైతు రూ.8,000–9,000 వరకు ఖర్చు చేస్తుండగా, మార్కెట్ ధరలు రూ.12,000 అటు ఇటుగా మాత్రమే ఉండటం రైతులను నిరుత్సాహపరుస్తోందన్నారు.
నేషనల్ టర్మరిక్ బోర్డు విజన్ 2047 కు అనుగుణంగా పనిచేసి, ధరల స్థిరత్వం, ముందస్తు మార్కెట్ సంకేతాలు రైతులకు అందించాలన్నారు. ప్రామాణిక మాయిశ్చర్ మీటర్లు, ఒకే రకమైన తేమ ప్రమాణాలు, పారదర్శక మార్కెట్ వ్యవస్థ అమలు చేయాలని సూచించారు.
RARE అగ్రి విజన్‌లో ప్రతిపాదించినట్టుగా అధిక కర్క్యూమిన్ రకాలను రైతులకు అందించడంతో పాటు, నాణ్యమైన టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి, ప్రపంచ ప్రమాణాలకు తగ్గ పసుపు ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడు మాత్రమే తెలంగాణ పసుపు ప్రపంచ మార్కెట్లలో స్థిరంగా నిలబడుతుందని తెలిపారు. అలాగే, విజన్ 2047 ప్రకారం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో పసుపును భాగం చేయాలని సూచించారు. ఆయిల్ పామ్ వంటి పంటల్లో చెట్ల మధ్య ఖాళీ ప్రదేశాల్లో పసుపు వంటి స్పైస్ పంటలను అంతరపంటలుగా సాగు చేయడం ద్వారా రైతులకు తక్కువ రిస్క్‌తో అధిక ఆదాయం లభిస్తుందన్నారు.
రైతులు ముడి పసుపును మాత్రమే అమ్మకుండా, విలువ జోడింపుపై దృష్టి పెట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. పసుపు భవిష్యత్ ముడి పంటలో కాదు, విలువ ఆధారిత ఉత్పత్తుల్లోనే ఉందని స్పష్టం చేశారు. పసుపు ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, న్యూట్రాస్యూటికల్స్, ఇమ్యునిటీ ఉత్పత్తులు, కాస్మోటిక్స్, కర్క్యూమిన్ ఎక్స్ట్రాక్షన్ వంటి ఉత్పత్తుల తయారీకి రైతులను ప్రోత్సహించాలని సూచించారు. దీంతో డిమాండ్ పెరిగి, రైతుల ఆదాయం పెరుగుతుందని, అప్పుడే తెలంగాణ రాష్ట్రం పెట్టుకున్న విజన్ 2047 లోని అగ్రి విజన్ లక్ష్యాలకు చేరువ అవుతామని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో టర్మరిక్ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, టర్మరిక్ బోర్డు సెక్రటరీ భవానీ శ్రీ, సిఐఐ తెలంగాణ చైర్మన్ శివ ప్రసాద్ రెడ్డి, అగ్రి యూనివర్సిటీ మాజీ విసి ప్రవీణ్ రావు, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గంగాధర్, సింథైట్ ఇండస్ట్రీస్ స్ట్రాటజిక్ సోర్సింగ్ హెడ్ జయశంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.