అన్నదాతకు ‘విద్యుత్’ వెలుగులు.. వ్యవస్థలో సమూల మార్పులు! : ​శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • ​మూడేళ్లలో 3.44 లక్షల వ్యవసాయ కనెక్షన్ల మంజూరు
  • ​రంగంలోకి విద్యుత్ అంబులెన్స్‌లు.. 1912కు ఫోన్ చేస్తే చాలు పరిష్కారం
  • ​​ప్రజా బాట ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం

రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పటిష్టం చేస్తూ, రైతులకు మరియు సామాన్య ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. సోమవారం శాసనమండలిలో quation hour లో విద్యుత్ శాఖపై జరిగిన చర్చకు ఆయన సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తూనే, ఆధునిక సాంకేతికతతో విద్యుత్ శాఖను ప్రజల ముంగిటకే తీసుకెళ్తున్నామని ఆయన వివరించారు. 2022 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, ఏకంగా 3,44,462 మంది రైతులకు కొత్త విద్యుత్ కనెక్షన్లు కల్పించినట్లు  తెలిపారు.  కనెక్టెడ్ లోడ్ కనెక్షన్ల  అనుగుణంగా 75,686 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. సీనియారిటీని ప్రాతిపదికన తీసుకుని ఎక్కడా వివక్ష లేకుండా కనెక్షన్లు ఇస్తున్నామని, మరో 9,700 మంది రైతులకు లైన్ పనులు పూర్తి కాగానే ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గడిచిన రెండేళ్లలో (2024, 2025) దాదాపు 2 లక్షల అదనపు కనెక్షన్లు ఇవ్వడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

​అంబులెన్స్ తరహాలో విద్యుత్ సేవలు విద్యుత్ అంతరాయం కలిగితే గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, ‘108’ తరహాలో విద్యుత్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు, థర్మల్ విజన్ కెమెరాలు, సేఫ్టీ గేర్ బాక్సులతో కూడిన వాహనం క్షేత్రస్థాయికి చేరుకుంటుందని తెలిపారు. ఈ వాహనంలో ఒక ఇంజనీర్ మరియు ఇద్దరు సిబ్బంది ఉండి యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరిస్తారని వివరించారు. ట్రాన్స్‌ఫార్మర్లు,​స్తంభాలు, వైర్ల కొరత లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు లేదా వైర్ల కొరత లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ‘ప్రజా బాట’ కార్యక్రమంలో అధికారులు వారానికి మూడు రోజులు పొలాల్లోనే ఉండి వంగిన స్తంభాలను, వేలాడుతున్న తీగలను సరిచేస్తున్నారని చెప్పారు. సభ్యులు ఏదైనా సమస్యను లిఖితపూర్వకంగా తన దృష్టికి తెస్తే, కేవలం 24 గంటల్లోనే పరిష్కరిస్తామని సభలో ధీమా వ్యక్తం చేశారు.