- రానున్న రోజుల్లో పర్యాటకంలో కొత్తపుంతలు
పర్యాటకంలో కేరళ రాష్ట్రంతో పోటీ పడే విధంగా తెలంగాణ పర్యాటకాన్ని తీర్చిదిద్దుతున్నామని, రానున్న రోజుల్లో పర్యాటకం కొత్త పుంతలు తొక్కనుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంత రావు అడిగిన ప్రశ్నకు మంత్రి జూపల్లి సమాధానం ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, పాయల శంకర్, మీర్ జుల్ఫికర్ అలీ అడిగిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం అనుకున్న రీతిలో పర్యాటకం అభివృద్ధి చెందలేకపోయిందని, రాష్ట్రంలో గతంలో పర్యాటక విధానం అంటూ లేకపోడవంతో ఈ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు నూతన పర్యాటక విధానాన్ని 2025-2030 తీసుకువచ్చామని వెల్లడించారు. పర్యాటక రంగాన్ని పీపీపీ మోడల్ లో అభివృద్ధి చేసేందుకు దేశ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్శించేందుకు రాయితీలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇదంలు భాగంగానే టూరిజం కానక్లేవ్, గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెష్టర్లు ముందుకు వచ్చారని, అనూహ్య స్పందన వచ్చిందని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఆ రంగం వాటాను పెంచడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం నిబద్ధతో పని చేస్తుందని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ సదుపాయం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. కౌలస్ కోట, నాగన్నమెట్ల బావి అభివద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయం, డిచ్ పల్లి ఖిల్లా రామాలయం అభివృద్ధికి పర్యాటక పరంగా ఉన్న అవకాశాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించి అమలు చేస్తాం. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ఏరియా టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దడంతో పాటు ఎస్సాఆర్ఎస్పీ రిజర్వాయర్ లో బోటింగ్ సదుపాయం, హరిత హోటల్ పునరుద్ధరణ, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండల కేంద్రంలోని దేశంలోనే అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి గుడి చెరువు అభివృద్ధి, బోటింగ్ సదుపాయం, రోప్ వే ఏర్పాటు గురించి అధ్యాయనం చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెప్పారు. సిరిసిల్లలో హరిత హోటల్ పెండింగ్ పనుల పూర్తికి చర్యలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్ నగరంలోని చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్ వంటి చారిత్రక, వారసత్వ ప్రదేశాలకు దేశ. విదేశీ పర్యాటకులను ఆకర్శించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రపంచ సుందరీ పోటీల సందర్భంగా సుందరీమణులను ఆయా పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా చేసి మన చారిత్రక, వారసత్వ సంపదను ప్రపంచానికి ఘనంగా చాటి చెప్పామని అన్నారు.