విశ్వశాంతికి బౌద్ధమే మార్గం: మంత్రి జూపల్లి కృష్ణారావు

  • మంత్రి జూప‌ల్లికి అంతర్జాతీయ ‘శాంతి’ పురస్కారం
  • బౌద్ధ వారసత్వ పరిరక్షణ, అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడి ప్రోత్సాహానికి ద‌క్కిన గౌర‌వం
  • విశ్వశాంతికి బౌద్ధమే మార్గం: మంత్రి జూపల్లి కృష్ణారావు
  • బుద్ధవనం ఇక గ్లోబల్ పీస్ సెంటర్.. అట్టహాసంగా అంతర్జాతీయ బౌద్ధ సదస్సు ప్రారంభం
  • బౌద్ధ వారసత్వానికి ప్రపంచ స్థాయి గుర్తింపు.. బుద్ధవనం ఇక ‘వరల్డ్ పీస్ సెంటర్స‌

హైదరాబాద్ : విద్వేషాలు, విభేదాలతో సతమతమవుతున్న ఆధునిక ప్రపంచానికి గౌతమ బుద్ధుని కరుణ, అహింసలే మానవాళిని కాపాడగలవని, ఆయ‌న బోధ‌న‌లు సమకాలీన సమస్యలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఉద్ఘాటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హరిత ప్లాజాలో జరిగిన ‘అంతర్జాతీయ బౌద్ధ శాంతి సదస్సు – 2026’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బౌద్ధ వారసత్వ పరిరక్షణ, ప్రపంచ శాంతి స్థాపనలో, అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడిలో మంత్రి చూపుతున్న చొరవను గుర్తిస్తూ ‘ఇంటర్నేషనల్ ఇంటర్‌ఛేంజ్ డెవలప్‌మెంట్ అసోసియేషన్’ ఆయనకు ప్రతిష్టాత్మకమైన ‘గ్రాండ్ ప్రైజ్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు వరల్డ్ పీస్’ అవార్డును ప్రదానం చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు మున్ యోంగ్ జో ఈ పురస్కారాన్ని అందజేస్తూ, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి ఆస‌ర‌గా నిలుస్తూ..మానవ విలువల కోసం కృషి చేస్తున్న మంత్రి సేవలను కొనియాడారు. అవార్డును స్వీకరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న శాంతి, సహనం, అహింస విలువలకు లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు.

సదస్సులో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ గడ్డ వేల ఏళ్లుగా బౌద్ధ వైభవానికి నిలయమని గుర్తుచేశారు. కృష్ణా నదీ తీరాన ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక వాదాన్ని, శూన్యతా సిద్ధాంతాన్ని ప్రవచించి, ఈ ప్రాంతాన్ని విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఫణిగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట వంటి చారిత్రక ప్రదేశాలు కేవలం పురావస్తు కేంద్రాలు మాత్రమే కావని, అవి మన మహోజ్వల నాగరికతకు సజీవ సాక్ష్యాలని ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక చిత్రపటంలో అగ్రగామిగా నిలబెడతామని మంత్రి స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ వద్ద 274 ఎకరాల్లో నిర్మించిన తెలంగాణ బౌద్ధ వారసత్వాన్ని ప్రస్తావిస్తూ నాగార్జునసాగర్ ప్రాంతంతో ఆచార్య నాగార్జునకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఫణిగిరి, నేలకొండపల్లి, ధూలికట్ట, కోటిలింగాల వంటి చారిత్రక క్షేత్రాల సంరక్షణ, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమగ్ర బౌద్ధ పర్యాటక వలయాన్ని రూపుదిద్దుతూ యాత్రికులకు ప్రపంచ స్థాయి అనుభవం కల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుద్ధవనం ప్రాజెక్ట్ నిర్వహించిన ఈ సదస్సు ప్రపంచ శాంతి దిశగా కొత్త పుంతలు తొక్కుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీలంక బౌద్ధ శాసన మంత్రి ప్రొఫెసర్ హినిదుమ సునీల్ సేనెవి, వియత్నాం ప్రతినిధి డాక్టర్ తిచ్ నాత్ తు, బుద్ధ‌వ‌నం ప్రాజెక్ట్ స్పెష‌ల్ ఆఫీస‌ర్ మ‌ల్లేప‌ల్లి ల‌క్ష్మ‌య్య‌, పురావ‌స్తు శాఖ డైరెక్ట‌ర్ అర్జున్ రావు, స‌ద‌స్సు కోఆర్డినేట‌ర్ శివ‌నాగి రెడ్డితో పాటు 22 దేశాల నుంచి వచ్చిన 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.