మంత్రి కోమటి రెడ్డి కృషితో… దక్షిణభాగం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి మరో కీలక అడుగు

  • మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి రాసిన లేఖ ద్వారా స్పష్టం చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
  • సదరన్ పార్ట్ రీజినల్ రింగ్ రోడ్డు కావాలని మీరు చేసిన ప్రతిపాదన పరిశీలించి.. డిపిఆర్ రూపొందిస్తున్నామని లేఖలో పేర్కొన్న నితిన్ గడ్కరీ
  • డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం కన్సల్టెన్సీ అపాయింట్ చేశామని, డిపిఆర్ రూపకల్పన జరుగుతుందని తన లేఖలో పేర్కొన్న కేంద్ర మంత్రి
  • కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లేఖ పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి కోమటి రెడ్డి
  • తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనార్థం తాను రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుని రిప్లై లేఖ రాసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కోమటి రెడ్డి
  • నార్త్ పార్ట్ ఇప్పటికే మంజూరై.. టెండర్ దశలో ఉన్నదని..సౌత్ పార్ట్ పట్ల కూడా సానుకూల నిర్ణయం తెలపడంతో పూర్తి స్థాయి రీజినల్ రింగ్ రోడ్డు(రింగ్) సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి
  • శ్రీరామ నవమి శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారనీ, యావత్ తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపిన మంత్రి కోమటి రెడ్డి
  • సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్మితం కాబోయే రీజినల్ రింగ్ రోడ్డు గేమ్ చేంజర్ కాబోతుందని మరోమారు స్పష్టం చేసిన మంత్రి కోమటి రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రహదారుల నెట్‌వర్క్‌లో మరో మైలురాయి చేరబోతోంది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరంతర కృషితో, దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్డు (Southern Part RRR) నిర్మాణ ప్రక్రియలో ఒక కీలక ముందడుగు పడింది. మంత్రి కోమటిరెడ్డి గతంలో చేసిన ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఈ ప్రాజెక్టు పురోగతిని వివరిస్తూ ఆయనకు ఒక అధికారిక లేఖ రాశారు. ​​సదరన్ పార్ట్ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ​ఈ పనుల కోసం ఇప్పటికే ప్రత్యేక కన్సల్టెన్సీని అపాయింట్ చేశామని, నివేదిక తయారీ ప్రక్రియ కొనసాగుతోందని గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారు. ​కేంద్రం నుంచి వచ్చిన సానుకూల స్పందన పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాము చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

​”శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఇది ఒక అద్భుతమైన శుభవార్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్మితం కాబోయే ఈ రీజినల్ రింగ్ రోడ్డు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయబోతోంది. ఇది తెలంగాణ అభివృద్ధికి నిజమైన ‘గేమ్ చేంజర్’గా నిలుస్తుంది.” అని మంత్రి పేర్కొన్నారు. ఈ రింగ్ రోడ్డు పూర్తయితే రవాణా వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, శివారు జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధికి భారీ అవకాశాలు లభిస్తాయన్నారు. ఇప్పటికే ఉత్తర భాగానికి అనుమతి తెలిపి టెండర్ ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంలో.. దక్షిణ భాగం పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తెలపడంతో పూర్తి రీజినల్ రింగ్ రోడ్డు(రింగ్)సాకారమవుతుందని మంత్రి తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉత్తర మరియు దక్షిణ భాగాల అనుసంధానంతో హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను పొందుతాయనీ,​ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో నిరంతరం సమన్వయం చేసుకుంటుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.