ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించే విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజీ పడదని, ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై, కల్తీ, నాసిరకం పదార్థాలతో ఆహారం తయారు చేసి విక్రయించే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి హెల్త్ వీక్ ప్రారంభమైంది. తొలిరోజు ఫుడ్ సేఫ్టీపై ఫోకస్ చేస్తూ ఆరోగ్యశాఖ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. ఉదయం నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ నుంచి హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వరకూ ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాక్ నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, తదితర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జలవిహార్ వద్ద మంత్రి జెండా ఊపి ఫుడ్ సేఫ్టీ వాక్‌ను ప్రారంభించారు. సుమారు వెయ్యి మందితో ఈ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. జలవిహార్ నుంచి ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వరకు వాక్ సాగింది. వాక్ ముగింపు సభలో మంత్రి మాట్లాడారు. ‘‘గత కొన్నేళ్లుగా ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. బిజీ లైఫ్ స్టైల్, వేగంగా జరుగుతున్న పట్టణీకరణ ప్రభావంతో ఇంట్లో వంట చేసుకోవడం తగ్గిపోయింది. బయట హోటళ్లు, రెస్టారెంట్లలో తినడం, ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్రంలో ఫుడ్ ఇండస్ట్రీ కూడా వేగంగా విస్తరించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా.. చిన్నవి, పెద్దవి అన్నీ కలిపి సుమారు 1.41 లక్షల ఫుడ్ బిజినెస్ సంస్థలు ఉన్నాయి. వీటిలో దాదాపు 80 శాతం పట్టణ ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉండటం, నగరాల్లో Ready to eat, Processed ఆహార పదార్థాలకు ఉన్న అధిక డిమాండ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. దురదృష్టవశాత్తూ, ఈ పరిస్థితిని కొంతమంది దుర్వినియోగం చేస్తూ దాదాపు ప్రతి ఆహార పదార్థంలో కల్తీకి పాల్పడుతున్నారు. ఉప్పు, పప్పులు, చింతపండు, చక్కెర, చాయిపత్తీ… దేన్నీ వదలడం లేదు. మరోవైపు, ఇంకొంతమంది నాసిరకం నూనెలు, నాణ్యతలేని పదార్థాలతో ఆహారం తయారు చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు. ఇటువంటి కల్తీ, నాసిరకం ఆహారం వినియోగం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. కల్తీ, నాసిరకం ఆహారం తిన్న ప్రజలు జీర్ణకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. దీర్ఘకాలంలో మధుమేహం, రక్తపోటు, గుండె, మూత్రపిండాల వ్యాధులు, అధిక బరువు వంటి సమస్యలకు కూడా కల్తీ, నాసిరకం ఆహారం కారణమవుతోందని డాక్టర్లు చెబుతున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అంతటా నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల భారం పెరుగుతుండటానికి అనారోగ్యకర ఆహార అలవాట్లు ఒక ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఈ రోగాల వల్ల ప్రజలు శారీరకంగా ఇబ్బంది పడడంతో పాటు, ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు. పరోక్షంగా ఇదంతా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫుడ్ సేఫ్టీ శాఖ, పోలీస్ శాఖల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా నిరంతర తనిఖీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు కొనసాగుతున్నాయి. గత రెండేళ్లలో 11,000కు పైగా తనిఖీలు నిర్వహించి, కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నాం. నాసిరకం, కల్తీ పదార్థాలతో ఆహారం తయారు చేసి అమ్ముతున్న హోటళ్లు, రెస్టారెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో ఈ తనిఖీలను మరింత కఠినతరం చేసి, ఎలాంటి రాజీ లేకుండా చర్యలు కొనసాగిస్తాం. ఫుడ్ సేఫ్టీ అమలు వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగా 24 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను నియమించాం. 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వాహనాలను రంగంలోకి దింపాం. నిజామాబాద్, హన్మకొండ, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో రూ.15 కోట్ల వ్యయంతో 3 కొత్త రీజినల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆహార నాణ్యత, ప్రజారోగ్య విషయంలో ఎటువంటి రాజీ ఉండదని ఇప్పటికే స్పష్టం చేశారు. డ్రగ్స్ నిర్మూలనకు EAGLE వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా, ఫుడ్ సేఫ్టీ కోసం కూడా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం గారు సంకల్పించారు. శాస్త్రీయ అధ్యయనం అనంతరం, త్వరలోనే ఒక కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చి.. ఆహార కల్తీ కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి పౌరుడికి సురక్షితమైన, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. అదే సమయంలో, ఫుడ్ ఇండస్ట్రీ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఈ రంగం అభివృద్ధిని ప్రోత్సహిస్తాం. నాణ్యమైన ఆహారం అందించే సంస్థలను కాపాడుకుంటాం. ఫుడ్ సేఫ్టీ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ఆహార ఉత్పత్తిదారులు, వ్యాపారులు, వినియోగదారులందరి సమిష్టి బాధ్యత. “ఈట్ రైట్ – స్టే హెల్తీ” అనే సందేశాన్ని అందరం ఆచరిద్దాం. కలిసికట్టుగా ఆరోగ్య తెలంగాణ నిర్మించుకుందాం.” అని మంత్రి పిలుపునిచ్చారు.
నేచర్ క్యూర్‌లో ఈట్ రైట్ మేళా:
సోమవారం ఉదయం 10 గంటల నుంచి బల్కంపేటలోని నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో ఈట్ రైట్ మేళాను నిర్వహించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పోషకాహరంపై ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేళాలో సోమవారం సాయంత్రం మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. ఈట్ రైట్ మేళాలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను మంత్రి సందర్శించారు. నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో పలువురు ఫుడ్ వెంటర్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. మిల్లెట్లతో తయారు చేసిన ఆహార పదార్థాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మిల్లెట్స్‌తో తయారు చేసిన ఐస్ క్రీమ్, కాఫీ, తదితర పదార్థాలను మంత్రి రుచి చూసి, తయారీ పద్ధతిని అడిగి తెలుసుకున్నారు. పాలు, పండ్లు, కాయగూరలు, మసాల దినుసులు, చిరుధాన్యాలు, టీ పౌడర్ , పప్పు దినుసుల్లో కల్తీని ఎలా గుర్తించాలో తెలుపుతూ ఫుడ్ సేఫ్టీ అధికారులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆహార పదార్థాల్లో జరిగిన కల్తీని ఎలా గుర్తించాలో, ఫుడ్ సేఫ్టీ అధికారులు, సైంటిస్టులు మంత్రికి వివరించారు. ఆయా పద్ధతులను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారికి అవగాహన కలిగేలా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి సూచించారు. ఇప్ప పువ్వుతో లడ్డులు, ఇతర ఆహార పదార్థాలను తయారు చేసి.. సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్ రన్ చేస్తున్న మహిళా సంఘం సభ్యురాలిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. స్టాళ్ల సందర్శన అనంతరం జరిగిన సభలో స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు మంత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ, ఆహార నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న పలు హోటళ్లు, రెస్టారెంట్ల ప్రతినిధులకు హైజీన్ సర్టిఫికెట్లను మంత్రి అందజేశారు. ఫుడ్ సేఫ్టీ – న్యూట్రీషియస్ ఫుడ్ ట్రైనింగ్‌లో పాల్గొన్న వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఏం తినాలో, ఎంత తినాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, మనం తింటున్న ఆహార నాణ్యత గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం అని పేర్కొన్నారు. ‘‘మంచి ఆహారపు అలవాట్ల గురించి, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకోవడానికి ఈట్ రైట్ మేళా వంటి కార్యక్రమాలు ఇందుకు ఎంతో దోహదపడుతాయి. ఆరోగ్యం బాగున్నప్పుడే, జీవితం ఆనందంగా ఉంటుందన్న విషయాన్ని బిజీ లైఫ్‌లో పడి మనం మర్చిపోతున్నాం. డబ్బు, ఉద్యోగం, సౌకర్యాలు అన్నీ ఉన్నా… ఆరోగ్యం లేకపోతే వాటికి విలువ ఉండదు. ఇటీవలి కాలంలో మన ఆహారపు అలవాట్లు మారిపోయాయి. బయట ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరిగింది. దీంతో పాటు, శారీరక శ్రమ, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. ఇది ఆందోళన కలిగించే విషయం. రోజూ కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేయడం చాలా అవసరం. వాకింగ్, యోగా, గేమ్స్… ఏదైనా ఒకటి మన నిత్య జీవితంలో భాగం కావాలి. శరీరం కదిలితేనే ఆరోగ్యం బాగుంటుంది. శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు.. మానసిక ప్రశాంతత కూడా అంతే ముఖ్యమైనది. ఈ రోజుల్లో ఒత్తిడి, ఆందోళన ఎక్కువవుతున్నాయి. సమయానికి తినకపోవడం, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం వంటివన్నీ మన మనసుపై కూడా ప్రభావం చూపుతున్నాయి. సరైన ఆహారం, వ్యాయామం, మంచి నిద్ర ఉంటేనే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. ఈ పరిస్థితుల్లో, “ఈట్ రైట్” అనే భావన చాలా కీలకం. మనము తినే ఆహారమే, మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది కాబట్టి, ఏం తినాలో, ఎక్కడ తినాలో ప్రజలు తెలుసుకోవాలి. వీలైనంత వరకూ ఇంట్లో వండిన ఆహార పదార్థాలనే తినడం మంచిది. ఆహారంతో పాటు ప్రతిరోజు వ్యాయామం చేయాలి, మనసుకు ప్రశాంతత కలిగించే జీవనశైలిని అలవరచుకోవాలి. ఆహార కల్తీ జరుగుతున్నట్టు మీ దృష్టికి వస్తే, వెంటనే పోలీసులకు లేదా ఫుడ్ సేఫ్టీ అధికారులకు లేదా ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి. తక్షణమే కఠిన చర్యలు తీసుకునే బాధ్యత మాది.” అని మంత్రి ప్రజలకు సూచించారు.