- వారికంటిన బురదను మాకు అంటించే ప్రయత్నం
- రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం : ప్రతిపక్షానికి చెందిన కొంతమంది వారికి అంటిన బురదని అధికార పార్టీకీ, అధికార పార్టీ నాయకులకు అంటించాలని చూస్తున్నారని ఎవరు ఎన్ని కారుకూతలు కూసిన భవిష్యత్తు లో ఇందిరమ్మ ప్రభుత్వం ని ప్రజలు దీవించడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం నాడు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మలో 1.52 కోట్లతో నిర్మించిన ప్యాక్స్ గోదాములను ప్రారంభించారు. అలాగే మండలంలో 191 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 58.58 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ ఎవరు ఎన్ని అవాకులు చవాకులు పేలిన ఈ ప్రభుత్వం పేదవారికి అండగా ఉంటుందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ధాన్యం కొన్న వారం రోజుల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. రైతును రాజు చేయడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని పేర్కొన్నారు. కేవలం నాలుగు నెలల్లోనే రూ. 20,670 కోట్ల మేర రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించామని ఏడాదికి ఎకరానికి రూ. 12 వేలు అందిస్తూ, సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త గా 3.80 లక్షల మందికి పాస్ పుస్తకాలను అందజేశామన్నారు. ధరణి తో రైతులు ఇబ్బందులు పడ్డారని దాన్ని బంగాళాఖాతంలో వేసి భూ భారతి తీసుకొచ్చామని తెలిపారు. అనంతరం వెంకటాపురంలో దేపంగి శ్రీకాంత్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న మంత్రి.. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్, మునిసిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, పాలేరు ప్రత్యేక అధికారి రమేష్, ఆర్డీఓ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి పుల్లయ్య, తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
