వడదెబ్బ బాధితులకు సత్వరమే చికిత్స: మంత్రి దామోదర్ రాజనర్సింహ

  • ప్రతి హాస్పిటల్‌లో ప్రత్యేకంగా ఒక బృందం
  • ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
  • వేసవి నేపథ్యంలో హాస్పిటళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు
  • అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల ఏర్పాటు
  • అన్ని వార్డులు, వెయిటింగ్ ఏరియాలో మంచినీటి సౌకర్యం
  • అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. ప్రభుత్వ దవాఖాన్లలో తాగు నీటి సౌకర్యం, అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్ల ఏర్పాటు, అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు, వడ దెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు హాస్పిటళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఉన్నతాధికారులతో మంత్రి బుధవారం సమీక్ష చేశారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ, డాక్టర్ గౌరవ్ ఉప్పల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎండా కాలం నేపథ్యంలో వడ దెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు తీసుకుంటున్న చర్యలను, హాస్పిటళ్లలో అవుట్‌ పేషెంట్, ఇన్‌పేషెంట్ల కోసం చేసిన ఏర్పాట్లను అధికారులు మంత్రికి వివరించారు. వడ దెబ్బ బాధితులకు తక్షణమే చికిత్స అందించేందుకు అన్ని హాస్పిటల్స్‌లో ఇప్పటికే ఏర్పాట్లు చేశామని, అవసరమైన మెడిసిన్, ఓఆర్‌‌ఎస్ వంటివి అందుబాటులో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవుట్ పేషెంట్లు, ఇన్‌ పేషెంట్లు, వారి అటెండెంట్లకు, హాస్పిటల్‌ సిబ్బందికి తాగు నీరు అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. పెద్ద హాస్పిటల్స్‌లో ప్రతి బ్లాక్‌లో, ప్రతి ఫ్లోర్‌‌లో డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్పిటల్ ఆవరణలో అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నందున ఉక్కపోత సమస్య ఎక్కువ అవుతున్నదని, ఈ నేపథ్యంలో అవుట్‌ పేషెంట్లకు, ఇన్‌పేషెంట్లకు, హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐసీయూలు, అవసరమైన ఇతర వార్డుల్లో ఏసీలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు రిపేర్ ఉంటే వెంటనే చేయించాలని ఆదేశించారు. అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలన్నారు.

అవగాహనతోనే నివారణ సాధ్యం
వడ దెబ్బ నివారణ కోసం తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు. వడ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హాస్పిటల్స్‌, బస్ స్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాలను ఎంపిక చేసుకుని అవేర్‌‌నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలన్నారు. సామాజిక మాద్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవసరమైన కంటెంట్‌ను రూపొందించి, ప్రజలకు చేరవేయాలన్నారు. ప్రతి సంవత్సరం ఉపాధి హామి కూలీలు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కార్మికులు వడ దెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని అవగాహన కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నారు. పట్టణాల్లో ఆటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌, ఇతర గిగ్ వర్కర్లకు వడ దెబ్బపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.

ఎమర్జన్సీలో డెడికేటెడ్ టీమ్ ఉండాలి:
వడ దెబ్బతో అనారోగ్యం పాలైన వారికి చికిత్స అందించేందుకు ఒక బృందాన్ని హాస్పిటల్ ఎమర్జన్సీ ఏరియాలో సిద్ధంగా ఉంచాలని మంత్రి సూచించారు. పేషెంట్ వచ్చిన వెంటనే చికిత్స ప్రారంభించేలా ఈ బృందంలోని సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. అవసరమైన మెడిసిన్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

జనరేటర్లు సిద్ధంగా ఉండాలి
వేసవి కాలంలో గాలిదుమారాలు, ఈదురు గాలులు, అకాల వర్షాల వలన విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంటుందని, ఇలాంటి సమయాల్లో పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా వెంటనే జనరేటర్లు ఆన్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దాదాపు అన్ని హాస్పిటల్స్‌లో జనరేటర్లు ఉన్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. అయితే, వెంటనే వాటి పనితీరును పరిశీలించాలని, అవసరమైన చోట రిపేర్లు, మెయింటనన్స్ చేయించాలని మంత్రి ఆదేశించారు.

అగ్ని ప్రమాదాల ముప్పు
వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే ముప్పు ఎక్కువగా ఉంటుందని అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. అన్ని హాస్పిటల్స్‌లో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని, ఈ నేపథ్యంలో అన్ని హాస్పిటల్స్‌లో పవర్ కేబుల్స్‌ను వెంటనే చెక్ చేయించాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన చోట పాత వైర్ల స్థానంలో, కొత్త వైరింగ్ చేయించాలని సూచించారు. హాస్పిటళ్ల లోపల, బయట గుట్కా నమలడం, స్మోకింగ్, డ్రింకింగ్ వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని మంత్రి ఆదేశించారు. అన్ని హాస్పిటల్స్‌లో ఫైర్ అలార్మ్, స్మోక్ట్ డిటెక్టర్స్‌ మాక్‌ డ్రిల్ నిర్వహించాలని సూచించారు. అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. మంటలను ఆర్పే యంత్రాలు సరిపడా ఉన్నాయో, లేవో? చూడాలని.. వాటి ఎక్స్‌పైరీ గడువు తేదీలను సైతం చెక్ చేయాలని ఆదేశించారు. మంటలు ఆర్పే యంత్రాల వినియోగంపై హాస్పిటల్‌ సిబ్బంది, సెక్యూరిటీకి మరోసారి శిక్షణ ఇవ్వాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ఫైర్ సేఫ్టీ, షార్ట్‌ సర్క్యూట్‌కు సంబంధించి చేయాల్సిన, చేయకూడని పనుల గురించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమీపంలోని ఫైర్ స్టేషన్ అధికారులతో, హాస్పిటల్ అధికారులు సమన్వయం చేసుకోవాలని, ఫైర్ సేఫ్టీ మాక్‌డ్రిల్స్‌ నిర్వహించాలని అధికారులకు సూచించారు.

బాధితులకు అండగా ఉండండి.. ప్రజలకు మంత్రి విజ్ఞప్తి:
ఎండలు ముదురుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. పిల్లలు, వృద్దులు, గర్భిణుల విషయంలో కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. బయటకు వెళ్లినప్పుడు ఎండదెబ్బ బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగు నీరు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకూడదని సూచించారు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే తక్షణమే సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలన్నారు. తమ చుట్టూ ఉన్నవారిలో ఎవరికైనా వడ దెబ్బ తగిలితే, వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు బాధితున్ని తరలించాలని, 108 అంబులెన్స్‌కు సమాచారం చేరవేయాలని మంత్రి ప్రజలను కోరారు.