నిబంధనలను తుంగలో తొక్కుతున్న పరిశ్రమలు.. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ తనిఖీల్లో బయటపడ్డ నిజాలు..

  • పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
  • ధనార్జనే ధ్యేయంగా యాజమాన్యాల వ్యవహారశైలి
  • సంగారెడ్డి ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో తనిఖీలు
  • విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ తనిఖీల్లో బయటపడ్డ కండ్లు బైర్లు కమ్మే నిజాలు
  • కాలుష్య నియంత్రణ మండలికి సంబందించిన అన్ని ప్రాంతీయ కార్యాలయాలలో తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్న పర్యావరణ వేత్తలు
  • అవినీతి అధికారులను కాపాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ వేత్తల డిమాండ్

ఏ వ్యక్తి అయినా ప్రభుత్వంచే నిర్దారించబడిన నిబంధనలకు లోబడే వ్యవహరించాల్సి ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఇదే నియమం అందరికి వరిస్తుంది. కాని కొన్ని పరిశ్రమలు మాత్రం నిబందనలను తుంగలో తొక్కి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అటువంటి పరిశ్రమలను గుర్తించి శాఖాపరంగా చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో పరిశ్రమల యాజమాన్యాలు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. కొద్దిరోజుల క్రితం రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ రామచంద్రాపురం యూనిట్ అధికారులు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు వారం రోజుల పాటు పటాన్ చెరువు, బొల్లారం పారిశ్రామిక ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమలను ఆకస్మిక తనిఖీ చేశారు. వారు తనిఖీ చేసిన సమయంలో అయా పరిశ్రమల్లో కనీసంగా ఉండాల్సిన పత్రాలు లేకపోవడం, ప్రభుత్వ నిబందనలను పాటించకపోవడం వంటి వాటిని గుర్తించారు.

కోర్ అర్బ న్ రీజియన్ ఎకానమీ (సిఆర్ యుఇ) పరిధిలో జరుగుతున్న అమలు చర్యలలో భాగంగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ రామచంద్రాపురం ప్రాంతీయ అధికారి అధ్వర్యంలో పటాన్ చెరువులోని మెసర్స్ కెకెఎస్ ఆర్గానిక్స్ పరిశ్రమలో, మెసర్స్ మంజీరా రబ్బర్ ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్ పరిశ్రమలో, బొలారంలోని మెసర్స్ లోటస్ చాక్లెట్ కంపెనీ లిమిటెడ్ పరిశ్రమలో, టిజి ఎస్పిడిసిఎల్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో, సంగారెడ్డి ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీలను చట్టబద్ద అనుమతులు, లైసెన్సుల స్థితి, పర్యావరణ రక్షణ చర్యలు, కార్మిక నియమాలు, భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ ఆదాయ అంశాలతో పాటు నియంత్రణ సంస్థల పనితీరును పరిశీలించే ఉద్దేశ్యంతో నిర్వహించారు. కాగా అయా పరిశ్రమల్లో కనీసంగా ఉండాల్సిన లైసెన్సులు లేకుండా కార్యకలాపాలు నిర్వహించడాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. స్థానిక సంస్థల నుంచి ట్రేడ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ విభాగం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ ఓసి), బాయిలర్ లైసెన్స్, కార్మికశాఖ లైసెన్స్ వంటివి లేకపోవడంపై అధికారులు విస్మయానికి గురయ్యారు. ఒక పారిశ్రామిక యూనిట్ కాలుష్య నియంత్రణ మండలి నుంచి చెల్లుబాటు అయ్యే కన్సెంట్ ఫర్ ఆపరేషన్ (సిఎఫ్ఒ) లేకుండా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అవే కాకుండా ఒక యూనిట్ లో తగిన పారిశ్రామిక భద్రతా చర్యలు లేకపోవడం, స్టాక్, ఉత్పత్తి, హాజరు రిజిస్టర్లు నిర్వహించకపోవడం, రిసైకిల్ ట్యాంకులు, వాల్హు దెబ్బతిన్న స్థితిలో ఉండి భద్రతా కవర్లు లేకపోవడం వంటి వాటిని చూసి అవాక్కయ్యా రు. బాయిలర్ ను పక్కనున్న భూమిపై ఎర్పాటు చేయడం, విద్యుత్ మీటర్ ను ప్రయోగశాల గదిలో ఏర్పాటు చేయడం వంటివాటిని గుర్తించారు. మరో యూనిట్ లో స్టాంపింగ్ గడువు ముగిసిన మూడు ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలు అండటం, సరైన లేబిలింగ్ లేకపోవడం. అస్పష్ట లేబింగ్ లీగల్ మెట్రాలజీ చట్ట ప్రకారం అవసరమైన ప్యాకింగ్ లైసెన్స్ లేకపోవడం వంటి వాటిని గుర్తించారు.

టిజిఎస్పిడిసిఎల్ కార్యాలయంలో…
విద్యుత్ శాఖా కార్యాలయంలో నిర్వహించిన తనికీల్లో పలు అంశాలను విజిలెన్స్ అధికారులు వెలికి తీశారు. 19 వేల 620 డిఫాల్టర్ల నుంచి 2.65 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని గుర్తించారు. విద్యుత్ దోపిడి, అనధికార వినియోగం, ట్యాంపరింగ్ కూ సంబందించిన 4వేల 685 కేసుల్లో 3.88 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉన్నప్పటికి చేయకపోవడం వంటి వాటిని బయటకు తీశారు.

ప్రభుత్వానికి నివేదికనిస్తాం…
వారం రోజుల పాటు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి (సియుఆర్ఎ) నిర్వహించిన తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన అన్ని అంశాలను నివేదిక రూపంలో పొందుపర్చి ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ప్రాంతీయ అధికారి తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా, ప్రభుత్వ నిబందనలను అనుసరించే విధంగా తమ శాఖ నిరంతరం తనిఖీలను కొనసాగిస్తుందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాలుష్య నియంత్రణ మండలికి సంబందించిన అన్ని జోనల్ మరియు ప్రాంతీయ కార్యాలయాలలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుయాలతో తనిఖీలు నిర్వహించాలని ప్రబుత్వాన్ని కోరుతున్న పర్యావరణ వేత్తలు. అవినీతి అధికారులను కాపాడుతున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ వేత్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలా జరిగినప్పుడే అవినీతి అధికారులకు భయం ఉండటంతో పాటు ప్రస్తున్న ప్రభుత్వంపై ప్రజలకు ఒ నమ్మకం కలుగుతుందని పలువురు కాలుష్య బాధితులు, పర్యావరణ వేత్తలు తెలిపారు.