పర్యాటక రంగంలో సరికొత్త ప్రయోగం: ‘రివర్స్ టూరిజం’: మంత్రి జూపల్లి కృష్ణారావు

  • ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ కు జెండా ఊపి ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
  • ఆదివాసీలతో కలిసి బస్సులో ప్రయాణించిన మంత్రి జూపల్లి
  • హైదరాబాద్ పయనమైన 250 మంది అడవి బిడ్డలు
  • మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న ఆదివాసీ బృందం
  • తారామతి బారదరి లో సాదర స్వాగతం పలకనున్న పర్యాటక శాఖ అధికారులు

ఉట్నూరు, ఏప్రిల్ 22: రాష్ట్ర పర్యాటక రంగ చరిత్రలో సరికొత్త ఒరవడికి నాంది పడింది. కేవలం నగరవాసులు ప్రకృతిని చూడటానికి పల్లెలకు వెళ్లడమే కాకుండా, అడవి బిడ్డలు సైతం ఆధునిక అభివృద్ధిని, చారిత్రక వైభవాన్ని కళ్లారా చూడాలన్న సంకల్పంతో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ‘రివర్స్ టూరిజం’కు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గోండు గూడెంలో బుధవారం నిర్వహించిన ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ను మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఆదివాసీలకు కొత్త అనుభవాలు ఇవ్వడం, నగర జీవన విధానం పరిచయం చేయడం, ఆత్మవిశ్వాసం పెంచడం, రెండు సంస్కృతుల మధ్య అవగాహన పెంచడం, సాంస్కృతిక మార్పిడి, అంతిమంగా ఆదివాసీల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు వివరించారు.

ఆదివాసీలతో మమేకమైన మంత్రి
కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాకుండా, మంత్రి జూపల్లి స్వయంగా ఆదివాసీలతో కలిసి బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రయాణ పొడవునా వారితో ముచ్చటిస్తూ పర్యటన లక్ష్యాన్ని వివరించారు. “బయటి ప్రపంచంతో అనుసంధానం కావడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నగరాల్లోని అభివృద్ధిని చూసి చదువుల పట్ల ఆసక్తి పెంచుకోవాలి. ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలి. అప్పుడే ఆదివాసీల జీవన ప్రమాణాల్లో మార్పులు వస్తాయి” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

నగర నాగరికతకు – సంస్కృతికి వారధి
ఆదివాసీల విశిష్ట సంస్కృతికి, నగర నాగరికతకు మధ్య ఈ కార్యక్రమం ఒక వారధిలా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. 5 ప్రత్యేక బస్సుల్లో బయలుదేరిన 250 మంది ఆదివాసీలు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తారామతి బారాదరికి చేరుకుంటారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో విమానాశ్రయం, చార్మినార్, గోల్కొండ కోట, లుంబినీ పార్క్, శిల్పారామం వంటి ప్రాంతాలను వీరు సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ కామ్డే పాల్గొన్నారు. వీరితో పాటు డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆత్రం సుగుణ, కాంగ్రెస్ నాయకులు ఆత్రం సక్కు, సోయం బాపురావు, ఆడే గజేందర్ తదితరులు పాల్గొన్నారు,