- విధి నిర్వహణలో మరణించిన గిగ్ వర్కర్ల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా
హైదరాబాద్ : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గిగ్ వర్కర్ల కుటుంబ సభ్యులకు కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గారు ఎక్స్గ్రేషియా చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. గిగ్ వర్కర్లు లోకుర్తి నరేష్, జీ. శ్యామ్ సుందర్ మరియు అహ్మద్ బిన్ అబ్దుల్ ఖాదర్ కుటుంబ సభ్యులకు మంత్రి స్వయంగా చెక్కులు అందజేశారు. సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్లకు అండగా నిలుస్తూ అసెంబ్లీలో గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ చట్టాన్ని ఆమోదించిందని తెలిపారు. గిగ్ వర్కర్లకు ఇలాంటి రక్షణ, భద్రతా వలయం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఏ కార్మికుడికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. గిగ్ వర్కర్లు అయినా, హమాలీలు అయినా అందరికీ ప్రభుత్వం నుండి తగిన సహాయం, పరిరక్షణ అందాల్సిందేనని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి గిగ్ వర్కర్ల యూనియన్ కీలక పాత్ర పోషించిందని, వారు కార్మిక శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ చర్యలను సాధ్యంచేసారని మంత్రి అభినందించారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ గిగ్ వర్కర్లు మరియు బలహీన వర్గాలను నిర్లక్ష్యం చేయదని, వారి హక్కులు మరియు సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో కార్మిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ దాన కిషోర్, కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ ఈ. గంగాధర్, గిగ్ వర్కర్ల యూనియన్ నాయకుడు సలావుద్దీన్ మరియు ఇతరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం అందించడంతో పాటు తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారికి, కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గారికి కృతజ్ఞతలు తెలిపారు.