నారాయణపేట ఆర్డీఓ రాంచందర్ నాయక్ ఇంట్లో నోట్ల కట్టలు

  • ఆర్డీఓ నివాసం నుంచి రూ.10.20లక్షల నగదు స్వాధీనం
  • జడ్చర్ల, మహబూబ్ నగర్ లో నాలుగు ఓపెన్ ప్లాట్లు
  • భూత్పూర్ లో 3.18 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తింపు
  • నారాయణపేటలో అర్ధరాత్రి వరకు ఆర్డీఓ ఇంట్లో సోదాలు
  • ఆర్డీఓ కుటుంబ సభ్యులు, బంధువుల బ్యాంకు ఖాతాల తనిఖీ
  • ఏసీబీ తనిఖీల్లో నగదుతో పాటు ఆస్తిపత్రాల సీజ్‌

ఏసీబీ వలలో చిక్కుకున్న నారాయణపేట ఆర్డీఓ రాంచందర్ నాయక్ కు సంబంధించి స్థిర, చర ఆస్తులతో పాటు బ్యాంకు ఖాతాలను సైతం ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణయ్య బృందం విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధ వారం తెల్లవారు జామున వరకు ఆర్డీఓ కార్యాలయంతో పాటు ఆర్డీఓ నివాసం ఉంటున్న క్వార్టర్స్ లో సోదాలు చేపట్టి రూ.10.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ లో బుధవారం సాయంత్రం వరకు చేపట్టిన తనిఖీల్లో ఆదాయానికి మించి ఆస్తులు బయటపడినట్లు సమాచారం. ఇప్పటి వరకు మహబూబ్ నగర్, జడ్చర్లలో నాలుగు ఓపెన్ ప్లాట్లు, భూత్పూర్ లో 3.18 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారుల తనిఖీలో తేలింది. ఆర్డీఓ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలతో పాటు కుటుంబసభ్యులు, సమీప బంధువులు, బినామీలు ఎవరైనా ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తూ వారి బ్యాంకు ఖాతాలను సైతం జల్లెడ పట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. నగదు దొరికింది రూ.10.20 లక్షలు అయితే దాచుకున్న సొమ్ము ఎంత అనేది తేటతెల్లం చేసేందుకు అధికారులు బయటికి తెలియకుండా రహస్యంగా సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఆర్డీఓ స్వగ్రామమైన భూత్పూర్ మండలం పోత్లగడ్డతండాలో ఆయన కుటుంబసభ్యులపై ఏమైనా వ్యవసాయ భూములు ఉన్నాయో ఆరా తీస్తున్నారు.

నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు
ఏసీబీలో వలలో చిక్కుకున్న ఆర్డీఓ రాంచందర్ నాయక్ పై లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసును నమోదు చేసిన ఏసీబీ అధికారుల బృందం బుధవారం హైదరాబాద్ లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం 14 రోజుల పాటు రిమాండ్ కు తరలించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.