- తీసుకున్న చర్యలపై నివేదికల అప్లోడ్ కోసమే
- అక్రమార్కులు తప్పించుకోకుండా చూసేందుకే.. విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ వెల్లడి
విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి ఇచ్చే నివేదికలపై ఆయా ప్రభుత్వ శాఖలు ఏం చర్యలు తీసుకున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను విజిలెన్స్ విభాగం ప్రారంభించింది. ఇందులో భాగంగా 27 ప్రభుత్వ శాఖలను ఆన్లైన్ ఫ్లాట్‌ఫారం మీదకు తీసుకొచ్చింది. విజిలెన్స్ విభాగం ఇచ్చే నివేదికలపై ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలు ఇన్నాళ్లు ఫైళ్ల రూపంలో అటు ఇటు తిరగడంతో.. అక్రమార్కులపై చర్యలు ఆలస్యమై అక్రమదందాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. దీనిని అరికట్టేందుకు యాక్షన్ టేకెన్ రిపోర్టులు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేలా ఈ పోర్టల్‌ను రూపొందించారు. దీని ద్వారా విజిలెన్స్ నివేదికలకు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు తక్షణ స్పందన ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఇదంతా పారదర్శకంగా ఉండటంతో అక్రమార్కులు తప్పించుకునే అవకాశం ఉండదని విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ తెలిపారు. ఇక క్షేత్ర స్థాయిలో విజిలెన్స్ సిబ్బందికి గుర్తింపు తీసుకురావడమే కాకుండా.. దాడులు, సోదాల సమయంలో వారిని గుర్తించేలా రూపొందించిన నూతన జాకెట్లను ఆమె అవిష్కరించి, సిబ్బందికి పంపిణీ చేశారు.