జ‌వాబుదారీత‌నం పెంచేందుకే సెంట్ర‌లైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం: సీఎం రేవంత్ రెడ్డి

  • విద్యార్థుల‌కు స‌కాలంలో పాఠ్య సామ‌గ్రి అందాలి
  • వ‌స్తువుల నాణ్య‌త విష‌యంలో రాజీప‌డొద్దు
  • ప్ర‌తి విద్యార్థి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి
  • సంక్షేమ శాఖ‌ల‌పై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన సామ‌గ్రి అంతా స‌కాలంలో అందేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. దుస్తులు, నోటు పుస్త‌కాలు, ఇత‌ర సామ‌గ్రి స‌కాలంలో అందితే విద్యార్థులు చదువుపై పూర్తి స్థాయిలో శ్ర‌ద్ధ చూపుతార‌ని సీఎం అన్నారు. విద్యా శాఖ‌తో పాటు బీసీ, మైనారిటీ, గిరిజ‌న‌ సంక్షేమ శాఖ‌లు, ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్ శాఖ‌ల ప‌రిధిలోని విద్యా సంస్థ‌ల్లోని విద్యార్థుల‌కు అంద‌జేసే సామ‌గ్రి సెంట్ర‌లైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు. గ‌తంలో ఏ శాఖ‌కు ఆ శాఖ ప్రొక్యూర్‌మెంట్, స‌ర‌ఫ‌రా చేప‌ట్ట‌డంతో ఏక‌రూప‌త లోపించ‌డంతో పాటు అనేక అక్ర‌మాలు చోటుచేసుకునేవ‌ని… వాటిని అరిక‌ట్టేందుకు సెంట్ర‌లైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని తీసుకువ‌చ్చామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గ‌తంలో దుస్తులు, నోటు పుస్త‌కాలు, ట్రంక్ పెట్టెలు, ఇత‌ర సామ‌గ్రి స‌ర‌ఫ‌రాకు సంబంధించి ఏ శాఖ‌కు ఆ శాఖ చేప‌ట్ట‌డంతో అవ‌క‌త‌వ‌క‌ల‌కు ఆస్కారం ఉండేద‌న్నారు. అటువంటి అవ‌క‌త‌వ‌క‌ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌హించేది లేద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.సెంట్ర‌లైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానంతో జ‌వాబుదారీత‌నం పెరుగుతుంద‌ని సీఎం అన్నారు. ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని… స‌ర‌ఫ‌రాదారుల ప్ర‌యోజ‌నాలు కాపాడేందుకు కాద‌న్నారు. విద్యార్థుల‌కు అంద‌జేసే నోటు పుస్త‌కాలు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్ షూట్లు, బెడ్ షీట్లు, స్కూల్ బ్యాగ్లు, ఐడీ కార్డులు, యూనిఫాంలు అన్నీ నాణ్య‌మైన‌వే ఉండాల‌ని అధికారుల‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నాణ్య‌త‌తో పాటు స‌కాలంలో అంద‌డంపైనా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వహించాల‌న్నారు. జూన్ 15 నాటికి విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన సామ‌గ్రి అంతా అందాల‌ని, అలా అంద‌గానే స‌ర‌ఫ‌రాదారుల‌కు చెల్లింపులు పూర్తి చేస్తామ‌ని సీఎం తెలిపారు.

విద్యార్థుల‌కు అంద‌జేసే వ‌స్తువుల‌కు సంబంధించి మండ‌ల స్థాయిలో ఒక నోడ‌ల్ అధికారిని నియ‌మించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అక్కడి నుంచి క్షేత్ర స్థాయిలో గ్రామాల్లోని పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాల‌ని, స‌ర‌ఫ‌రాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీయించాల‌న్నారు. ప్ర‌తి విద్యార్థికి వారికి అవ‌స‌ర‌మైన సామ‌గ్రి అంతా అందిందా లేదా అనే దానిని చెక్ చేసుకోవాల‌ని సీఎం ఆదేశించారు. నోటు పుస్త‌కాలు, యూనిఫాం, ఇత‌ర సామ‌గ్రి క్వాలిటీ… వాటిని అందుకున్న త‌ర్వాత వారి భావాల‌ను తెలియ‌జేసేందుకు విద్యార్థుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాల‌ని సీఎం సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖల మ‌ధ్య సమన్వయానికి ఒక క‌మిటీని నియ‌మించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు పి.సుద‌ర్శ‌న్ రెడ్డి, ఎంపీ వేం న‌రేంద‌ర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీ‌నివాసులు, గిరిజ‌న సంక్షేమ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌బ్య‌సాచి ఘోష్‌, విద్యా శాఖ కార్య‌ద‌ర్శి యోగితా రాణా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి ష‌ఫీఉల్లా, బీసీ సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి బాల మాయాదేవి, సెర్ప్ సీఈవో దివ్య‌, ఉన్న‌త విద్యా శాఖ కమిష‌న‌ర్ శ్రీ‌దేవ‌సేన‌, పాఠశాల విద్యా శాఖ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ న‌వీన్ నికోల‌స్‌, గిరిజ‌న సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి సంతోష్‌, TGBCWRIES కార్య‌ద‌ర్శి బి.సైదులు త‌దిత‌రులు పాల్గొన్నారు.