నాణ్యమైన విత్తనాలనే రైతులకు అందుబాటులో ఉంచాలి: మంత్రి తుమ్మల

  • విత్తన కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష
  • నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి
  • కో మార్కెటింగ్ పై నిర్ధిష్ట నియమాలు రూపొందించాలి
  • HT పత్తి విత్తనాలు రాష్ట్రంలోకి రానివ్వకుండా రాష్ట్ర సరిహద్దుల్లో కఠిన భద్రత ఏర్పాటు చేయాలి
  • ఖరీఫ్ సాగు నాట్ల సమయానికి రైతులకు కావలసిన విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల

ఈ రోజు సచివాలయంలో వ్యవసాయశాఖ, సీడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ మరియు విత్తన కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. వానాకాలం (ఖరీఫ్) 2026 సాగు సన్నాహకంలో భాగంగా, వచ్చే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి విత్తనాల లభ్యతను కంపెనీల వారీగా, పంటల వారీగా సమీక్షించారు. రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలే అందుబాటులో ఉంచాలని మంత్రి స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వానాకాలం 2026లో రాష్ట్రంలో సుమారు 134.66 లక్షల ఎకరాల్లో సాగు జరిగే అవకాశముండగా, దానికి 19.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో 38.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, అవసరానికి దాదాపు రెండింతలు నిల్వలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.

పత్తి సాగు విషయంలో సుమారు 52 లక్షల ఎకరాల లక్ష్యంతో, రైతులకు అవసరమైన 104 లక్షల ప్యాకెట్లకు బదులుగా 212.11 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. గత సంవత్సరం వినియోగంతో పోలిస్తే ఈ సంవత్సరం అధిక నిల్వలు రైతులకు విశ్వాసాన్ని కలిగిస్తాయని మంత్రి పేర్కొన్నారు. హైబ్రిడ్ విత్తనాల లభ్యతపై ప్రత్యేకంగా చర్చిస్తూ, రైతుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనాలను ప్రాధాన్యంగా సరఫరా చేయాలని మంత్రి సూచించారు. విత్తనాల నాణ్యతపై ఎలాంటి రాజీ పడకూడదని, సీడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. నాణ్యత లేని విత్తనాల తయారీ, విక్రయాలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, గతంలో సబ్‌స్టాండర్డ్ విత్తనాలపై కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్రతి నెలాఖరులో కంపెనీలు తమ స్టాక్ వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని, సెల్ఫ్ సర్టిఫైడ్ విత్తనాల వల్ల నష్టం కలిగితే కంపెనీలే భరించాలని సూచించారు. వరి సన్నరకాల ఎంపికలో రైతులు, మిల్లర్లు, వినియోగదారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, అంతర్జాతీయ ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా ఎంపిక చేయాలని మంత్రి సూచించారు. కంపెనీలు తమ విత్తనాల స్టాక్‌ను మే 15 నుండి రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నకిలీ విత్తనాల నిఘా గురించి మంత్రి మాట్లాడుతూ, జిల్లా నుండి మండల స్థాయివరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి, అక్రమ నిల్వలు, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా లూస్ కాటన్ విత్తనాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

విత్తనాల సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు లైసెన్సింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని మంత్రి పేర్కొన్నారు. GOT ఫెయిల్ అయిన పత్తి విత్తనాలను పూర్తిగా వినియోగానికి అనర్హంగా ప్రకటించి రైతులకు చేరకుండా నిరోధించాలని ఆదేశించారు. అదేవిధంగా కో మార్కెటింగ్ విధానంలో ఏ కంపెనీ విత్తనాన్ని, ఏ కంపెనీ, ఏ పేరుతో అమ్ముతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని, సీడ్ యాక్ట్ లో ఉన్న కొన్ని లోపాలను కంపెనీలు అవకాశంగా మార్చుకొని రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలను తమ ప్రభుత్వం ఉపేక్షించదని తెలిపారు. అవసరమైతే కో మార్కెటింగ్ పూర్తి రద్దుచేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మట్టిసారాన్ని పెంపొందించే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. వానాకాలం 2026లో 1.95 లక్షల క్వింటాళ్ల పంపిణీకి రూ.134 కోట్లు వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు.

ఖరీఫ్ నాట్లకు ముందే అన్ని విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, నాణ్యతపై రాజీ లేకుండా, నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేయాలని మంత్రి తుమ్మల గారు స్పష్టం చేశారు. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, విత్తన కంపెనీలతో సమన్వయం కొనసాగించాలని సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం, మరియు నకిలీ విత్తనాల నిర్మూలన కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడ్ కార్పోరేషన్ డెవలప్ మెంట్ చైర్మన్ అన్వేష్ రెడ్డి వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, మార్క్ ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి మరియు వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మంత్రి తుమ్మలతో డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రతినిధుల భేటీ
ఈ రోజు సచివాలయంలో డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రతినిధులు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు వాతావరణ పరిస్థితులపై సమయానుకూల సలహాలు అందించే దిశగా వారు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రతినిధులు మాట్లాడుతూ, ఒడిశా, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో పైలట్ ప్రాజెక్ట్‌గా తమ సంస్థ స్వతంత్రంగా పనిచేస్తోందని తెలిపారు. రైతులకు సాగుకు ముందుగానే వాతావరణ పరిస్థితులు, వర్షపాతం వివరాలను SMS మరియు WhatsApp ద్వారా చేరవేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమాచారంతో రైతులు నాట్లు వేయాల్సిన సమయం, పంట కోతలు చేపట్టాల్సిన సమయం, మార్కెట్లో అమ్మకానికి అనుకూలమైన సమయాన్ని ముందుగానే నిర్ణయించుకోగలుగుతున్నారని వివరించారు. అలాగే అకాల వర్షాలు, తుఫానులు, గాలిదుమారాలు వంటి విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల కలిగే పంట నష్టాన్ని తగ్గించేందుకు ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అమలుకు ప్రభుత్వ సహకారం అందించాలని ప్రతినిధులు మంత్రిని కోరారు. దీనిపై సమగ్రంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారిని మంత్రి ఆదేశించారు.