మే చివరి నాటికి ‘2 బిహెచ్ కె’ ఇండ్ల కేటాయింపు పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ లేదు
  • సరిహద్దు వివాదాలకు స్వస్తి పలకాలి
  • రెవెన్యూ, ఫారెస్టు జాయింట్ సర్వే
  • ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో మంత్రి పొంగులేటి సుదీర్ఘ సమీక్ష

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు ఏస్థాయిలో కూడా ఉన్నా కూడా మే నెల చివరి నాటికి లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ఇండ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అంసపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి ఇంతవరకు ఖర్చు చేసిన మొత్తాన్ని మినహాయించి , తదుపరి అవసరమైన వ్యయాన్ని ఐదు లక్షల లోపు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందచేస్తామని వెల్లడించారు. అసంపూర్తిగా ఉన్న 2 బిహెచ్ కె లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్దిదారులే నిర్మించుకునేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ఇండ్ల నిర్మాణాలకు గ్రీన్ ఛానల్ లో నిధులు విడుదల చేస్తామన్నారు. గురువారం నాడు హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇన్ ఛార్జి మంత్రులు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో హౌసింగ్ రెవెన్యూ, ఫారెస్టు అధికారాలతో రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, కరీంనగర్ ఇన్ ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటి-పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, ఎస్సీ ,ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హెచ్.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేయాలని , విద్యుత్, మంచినీటి, డ్రైనేజి , రోడ్లు వంటి కనీస వసతులు కల్పించాలని చాలా ఇండ్లలో అనర్హులు ఉన్నారని, వారిని తొలగించి అర్హులకు ఇవ్వాలని సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తక్షణమే అనర్హులను తొలగించే చర్యలు చేపట్టాలని, అర్హులకు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందులో ఎమ్మెల్యేలను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. 400 కోట్ల రూపాయలతో 2 బిహెచ్ కె కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు తీసుకుని అక్కడ నివసించని వారి ఇండ్లను రద్దు చేసి, అర్హులైన ఇతరులకు వాటిని మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు. 2 బిహెచ్ కె బిల్లుల చెల్లింపుల్లో, అక్రమాలకు పాల్పడితే సస్పెండ్ తో సరిపెట్టనని సర్వీసు నుంచి తొలగించడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పేదవారి సొంత ఇంటి కలను నిజం చేసేలా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని, ఎల్-1, ఎల్-2, ఎల్-3 దరఖాస్తు ఇప్పుడు చేశారు, అప్పుడు చేశారనేది ముఖ్యం కాదనీ పేదరికమే అర్హతని, అర్హులైన వారికి ఇండ్లను ఇవ్వడమే కలెక్టర్ల బాధ్యత అని అన్నారు. మొదటి విడతలో వివిధ కారణాలతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోని వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు.

పేదవాడికి సహాయం అందించాలన్న సదుద్ధేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి నిర్మాణానికి అవసరమైన 40 టన్నుల ఇసుకను ఉచితంగా అందచేస్తున్నారని తెలిపారు. అయితే లబ్దిదారుల ముసుగులో అక్కడక్కడా దుర్వినియోగం అవుతున్నదన్న సమాచారం ఉన్నదని , ఈ నేపథ్యంలో అర్హులకు ఇసుక అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ఆచరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ఒక పాలసీని రూపొందించాలని సూచించారు నగరానికి దూరంగా 2బిహెచ్ కె కాలనీలను నిర్మించడం వల్ల లబ్ధిదారులు అక్కడ నివసించడానికి ఇష్ట పడటం లేదని, అక్కడ నివసిస్తే తమ జీవనోపాథికి ఇబ్బందికి కలుగుతుందని లబ్దిదారులు వెళ్లడం లేదు. తీసుకున్న ఇండ్లను అద్దెకి ఇచ్చి నగరంలోనే ఉంటున్నారు. ఇలాంటి వారిని గుర్తించి, వారి స్థానంలో, ఆయా కాలనీలకు సమీపంలో నివసించే వారికి కేటాయించలన్న ఆలోచన చేస్తున్నాము. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాము.

ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ లేదు
ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి పడబోమని మంత్రిగారు స్పష్టం చేశారు. భూములను ఆక్రమణలను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రెవెన్యూ, ఫారెస్టు భూముల సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని మంత్రి గారు పేర్కొన్నారు. ఇందుకోసం రెవెన్యూ, ఫారెస్టు విభాగాలు జాయింట్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఈ సర్వేలను శాస్త్రీయ పద్దతుల్లో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిర్వహించి భూముల స్పష్టమైన సరిహద్దులను గుర్తించాలని సూచించారు. దీనిద్వారా భవిష్యత్తుల్లో వివాదాలకు తెరపడుతుందన్నారు. రాష్ట్రంలో భూ పరిపాలనను బలోపేతం చేయడంలో భాగంగా సర్వే, సెటిల్ మెంట్ మరియు భూ రికార్డుల శాఖ ద్వారా సమగ్ర సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. భూ రికార్డుల్లో పాదర్శకత, ఖచ్చితత్వం తీసుకుని రావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లను మండలాలను ఏర్పాటు చేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఎక్కడా కలపడం కానీ, తీసివేయడం గానీ లేదని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మిస్తున్నామని, అలాగే ఎమ్మార్వో ఆర్డీవో కార్యాలయాలు కూడా నిర్మిస్తున్నామని వీటికి అవసరమైన ప్రతిపాదనలను పంపాలని కలెక్టర్లకు సూచించారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం చాలా ప్రతిష్టాత్మకమైనది, ఈ పథకం చాలా అద్భుతంగా అమలు అవుతున్నది దీనిపై కలెక్టర్లు మరింత ఫోకస్ పెట్టాలని సూచించారు. మంజూరైన ప్రతి ఇల్లు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనేత్తిన అంశాలన్నీ పరిష్కారమయ్యే విధంగా క్షేత్ర స్థాయిలో అధికారులు కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి శ్రీ డిఎస్ లోకేష్ కుమార్, హౌసింగ్ కార్యదర్శి శ్రీ విపి గౌతం తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభం
హౌసింగ్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయంలో 30 కెవి ఉత్పాదన సామర్ధ్యంతో నెలకొల్పిన సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ప్లాంట్ ను గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా నెలకు సుమారు 4500 యూనిట్ల మేర విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చు. హౌసింగ్ కార్పొరేషన్ భవనంలో వినియోగించే విద్యుత్ లో ఈ మేరకు ఆదా అవుతుందని ఎండి శ్రీ విపి గౌతం తెలిపారు.