- 2 ఓసీ గనులు, 3 భూగర్భగనుల బొగ్గు నిల్వల తవ్వకం కోసం రూపొందించిన విశిష్ట ప్రాజెక్టు
- భూగర్భ బొగ్గు నిల్వల గరిష్ట వినియోగం కోసం వినూత్న ప్రణాళిక
- 314.98 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వల సద్వినియోగమే లక్ష్యం
- ఏడాదికి 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి
- 25 ఏళ్లపాటు కొనసాగనున్న బొగ్గు తవ్వకాలు
- రామగుండం రీజియన్ కు కొత్త ఊపిరిలు పోస్తున్న ప్రాజెక్ట్
సింగరేణి భవన్ : సింగరేణి సంస్థ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వినూత్నమైన రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ ఇటీవల ప్రాథమిక అనుమతుల మంజూరుకు అంగీకారం తెలిపింది.. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ నుండి సింగరేణి యాజమాన్యానికి శుక్రవారం సమాచార సందేశం అందింది. మరో 10 రోజుల్లో అనుమతి పత్రాలు రానున్నాయి. సంస్థ సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి మార్గనిర్దేశంలో డైరెక్టర్లు, అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించడం విశేషం. సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా ఏడాదికి 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యంతో రూపొందించిన ఈ వినూత్న ప్రాజెక్టుకు ప్రాథమిక పర్యావరణ అనుమతులు లభించడం పట్ల సింగరేణి యాజమాన్యం హర్షం ప్రకటిస్తోంది. మూతపడుతున్న పాత గనుల ఉత్పత్తిని భర్తీ చేయడానికి, ఇప్పటికే కనీస అనుమతులు ఉన్న 2 ఓపెన్ కాస్ట్ గనులు, 3 భూగర్భ గనుల పరిధిలోని బొగ్గును ఇంకా తవ్వి తీయటానికి అనువుగా ఉన్న 314.98 మిలియన్ టన్నుల నిల్వలను ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాజెక్టును రూపొందించారు.
ఇక్కడ ఉత్పత్తి చేసే బొగ్గు ప్రధానంగా సమీపంలోని ఎన్టీపీసీ రామగుండం వారికి మరియు ఇతర బొగ్గు ఆధారిత పరిశ్రమలకు ఇంధన సరఫరా ఒప్పందం ప్రకారం సరఫరా చేయనున్నారు.
ప్రకృతి వరమైన బొగ్గును గరిష్టంగా వెలికి తీయడమే లక్ష్యం
మూతపడిన జీడీకే-10 ఇంక్లైన్, మూతపడనున్న వకీల్ పల్లి భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చి అక్కడ మిగిలి ఉన్న బొగ్గును సంపూర్ణంగా వెలికి తీయడంతో పాటు, ఈ గనులకు ఆనుకొని ఉన్న రామగుండం ఓపెన్ కాస్ట్-1 విస్తరణ ప్రాజెక్టు ఫేజ్ 2, రామగుండం ఓపెన్ కాస్ట్-2 విస్తరణ ప్రాజెక్టు, అడ్రియాల షాఫ్ట్ అండర్ గ్రౌండ్ విస్తరణ ప్రాజెక్టుల అంచులలో మిగిలిన బొగ్గును కూడా గరిష్టంగా వెలికి తీయడం కోసం, వీటన్నిటినీ కలిపి రామగుండం కోల్ మైన్ అనే ఒక విశిష్ట ప్రాజెక్టుకు కంపెనీ రూపకల్పన చేయడం జరిగింది.
ఇప్పటికే ఉన్న అనుమతులను సద్వినియోగం చేస్తూ తక్కువ పెట్టుబడులతో, పర్యావరణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బొగ్గు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా దీన్ని తయారు చేశారు. మూతపడుతున్న గనుల ఉత్పత్తిని భర్తీ చేసుకోవడంతోపాటు ఈ గని రామగుండం రీజియన్ కు మరో 25 సంవత్సరాల జీవిత కాలాన్ని అందించనుంది.
అనేక విశిష్టతలు గల ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి సాధారణంగా భూగర్భంలో బొగ్గు తవ్వకం అయిపోయిన తర్వాత కూడా కొంతమేర బొగ్గు గనిలో మిగిలిపోతుంది. ప్రకృతి వరప్రసాదమైన బొగ్గును ఈ విధంగా వదిలివేయకుండా సద్వినియోగం చేసుకోవడం కోసం సింగరేణి సంస్థ గతంలో మూతపడిన భూగర్భ గనుల ప్రదేశంలో ఓపెన్ కాస్ట్ గనులను ప్రతిపాదించి అనుమతులు సాధించి బొగ్గు తవ్వకాలు విజయవంతంగా నిర్వహించింది. వీటిలో కొత్తగూడెంలోని గౌతమ్ ఖని ఓపెన్ కాస్ట్ గని, మణుగూరులో మణుగూరు ఓపెన్ కాస్టు గని మరికొన్ని ఓసీ గనులతో పాటు తాజాగా కొత్తగూడెంలోని వీకే కోల్ మైన్ ను పేర్కొనవచ్చు. ఇదే తరహాలో రామగుండం-1 ఏరియాలో మూతపడిన జీడీకే-10 ఇంక్లైన్ గనిలో మిగిలి ఉన్న 56.79 మిలియన్ టన్నుల బొగ్గు, రామగుండం-2 ఏరియాలో త్వరలో మూతబడనున్న వకీల్ పల్లి గనిలో మిగిలి ఉండే 28.99 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయడం కోసం అక్కడ ఓపెన్ కాస్ట్ తరహా మైనింగ్ జరపాలని యోచించింది.
దీనితో పాటు ఈ రెండు గనులకు ఆనుకొని ఉన్న రామగుండం ఓపెన్ కాస్ట్-1 విస్తరణ ప్రాజెక్టు ఫేజ్-2 కు మధ్య సరిహద్దు ప్రాంతంలో రక్షణ నిమిత్తం వదిలేసిన 25.98 మిలియన్ టన్నుల బొగ్గు, ఇంకా ఈ గనులకు పక్కన అటు ఇటు ఉన్న బొగ్గు నిల్వలు 3.90 మిలియన్ టన్నులు, రామగుండం ఓపెన్ కాస్ట్-2 విస్తరణ ప్రాజెక్టు, అడ్రియాల షాఫ్ట్ అండర్ గ్రౌండ్ విస్తరణ గనుల సరిహద్దు తలాల వద్ద మిగిలి ఉన్న బొగ్గును కూడా ఈ ప్రాజెక్టు కిందనే తవ్వి తీయాలని నిర్ణయించింది. దీనిలో ఓపెన్ కాస్ట్ గనుల ప్రాంతం నుండి 182.28 మిలియన్ టన్నుల బొగ్గు, భూగర్భ గనుల ప్రాంతం నుండి 132.70 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉత్పత్తి చేయనున్నారు. ఇక్కడి సగటు బొగ్గు గ్రేడు జీ-10 గా గుర్తించబడింది. ఈ మొత్తం 5 గనుల పరిధిలోని బొగ్గును తవ్వడం కోసం ఇప్పటికే ఉన్న అనుమతులకు అదనంగా మరికొన్ని అనుమతులను సాధించాలని నిర్ణయించి రామగుండం కోల్ మైన్ అనే పేరుతో ఒక కొత్త ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంది.
ప్రాజెక్టు ఎలా ప్రారంభమవుతుంది?
ముందుగా మూతపడిన జీడికే-10 ఇంక్లైన్ భూగర్భ గనిని ఓపెన్ కాస్ట్ గనిగా మారుస్తారు. దీనిని ఓపెన్ కాస్ట్-1 గనిని ముందుకు కొనసాగిస్తూ షావెల్-డంపర్ పద్ధతిలో తవ్వుతూ వెళ్తారు. ఈ క్రమంలో వచ్చే ఓవర్ బర్డెన్ మట్టిని ప్రస్తుతం ఆర్.జి ఓసీ-1 ఎక్స్ టెన్షన్ ఫేజ్-2 లో బొగ్గు తవ్వగా ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో నింపుతూ వస్తారు. ఇలా జీడీకే-10 ఇంక్లైన్ ప్రాంతంలోని బొగ్గు తవ్వకానికి 8 సంవత్సరాల సమయం పడుతుంది. ఆ తర్వాత వకీల్ పల్లి గనిని ఓపెన్ కాస్ట్ గనిగా మారుస్తారు. ఈ క్రమంలో వకీల్ పల్లి ఓపెన్ కాస్ట్ గని ప్రాంతం నుండి వచ్చే ఓవర్ బర్డెన్ మట్టిని అప్పటికే తవ్వకం పూర్తయిన జీడీకే-10 ఇంక్లైన్ క్వారీలో ఏర్పడే ఖాళీ ప్రదేశంలో నింపుతారు. ఈ విధంగా రెండు భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చినప్పటికీ ఆ క్వారీలలో అక్కడ ఉత్పత్తి జరిగే ఓవర్ బర్డెన్ మట్టితోనే నింపుతారన్నమాట. ఇది ఒక భారీ పర్యావరణహిత చర్యగా పేర్కొనవచ్చు. అలాగే రామగుండం కోల్ మైన్ లో భాగంగా ఉన్న ఇతర ఓపెన్ కాస్ట్ గనుల బొగ్గు తవ్వకాలను కొనసాగిస్తారు. ఈ మొత్తం బొగ్గు తవ్వకాన్ని లాంగ్ వాల్, కంటిన్యూయస్ మైనర్, బోర్డర్ మైనర్స్, రోడ్డు హెడర్స్ ద్వారా అలాగే షావెల్-డంపర్ ప్రక్రియలో నిర్వహిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు 4326.08 హెక్టార్ల విస్తీర్ణం గల భూమి అవసరం ఉంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 5,403 మంది సింగరేణి ఉద్యోగులు గాను, మరో 600 మంది కాంట్రాక్టు సిబ్బంది గాను పని చేయనున్నారు. మొత్తం 2,194.05 కోట్ల రూపాయల మూల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. రామగుండం రీజియన్ కు ఒక వరంగా ఆర్.జి కోల్ మైన్ రామగుండం రీజియన్ లోని 3 ఏరియాలలో కొన్ని పాత గనులు మూతపడుతున్నందు వల్ల సింగరేణి సంస్థ ఆ గనుల్లోని ఉద్యోగులకు వేరే చోట పని కల్పించడానికి, బొగ్గు ఉత్పత్తి లోటు తీర్చడానికి ఈ ఆర్.జి కోల్ మైన్ ఒక వరంగా మారనున్నదని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టులో సుమారు 5,500 మంది ఉద్యోగులకు పని చేసే అవకాశం లభించబోతోంది. వ్యాపారపరంగా కూడా సింగరేణికి ఇది ఒక అద్భుత అవకాశం. రామగుండంలోని ఎన్టీపీసీ కి సింగరేణి సంస్థ దశాబ్దాల కాలంగా బొగ్గు సరఫరా చేస్తుంది. సింగరేణికి ఉన్న అతి పెద్ద వినియోగదారు ఎన్టీపీసీ. పాత గనులు మూతపడుతున్న నేపథ్యంలో తగినంత బొగ్గును ఎన్టీపీసీ కి అందించలేని పరిస్థితి ఏర్పడేది కానీ రామగుండం కోల్ మైన్ కు అనుమతి రావడం వల్ల ఎన్టీపీసీతో సింగరేణి వ్యాపార బంధం ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగనుంది. కనుక సింగరేణికి ఈ కొత్త ప్రాజెక్టు ఒక వరప్రదాయనిగా పేర్కొనవచ్చు.