సంక్షేమంలో తెలంగాణకు పూర్తి సహకారం అందిస్తాం: సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్

  • పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను కేంద్ర కార్యదర్శికి వివరించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  • రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు భేష్ అంటూ కితాబు

హైదరాబాద్: కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ ఐఏఎస్ సోమవారం హైదరాబాద్‌లో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి, బీసీ సంక్షేమం (OBCs/EBCs/DNTs), దివ్యాంగుల సంక్షేమం, ట్రాన్స్‌జెండర్ సంక్షేమం వంటి రంగాల్లో అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. అంతకు ముందు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్రంలో అమలవుతున్న ఎస్సీ అభివృద్ధి, దివ్యాంగుల సాధికారత, ట్రాన్స్‌జెండర్ సంక్షేమం, వృద్ధుల సంరక్షణ వంటి పథకాలపై సమగ్ర నివేదికను సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగుతోందని మంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, వృద్ధుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వం కట్టుదిట్టంగా పనిచేస్తోందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని మంత్రి కోరగా, సుధాంశ్ పంత్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రం ప్రతిపాదించే ప్రతి వినూత్న పథకానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తదనంతరం మసాబ్ ట్యాంక్‌లోని డే కేర్ సెంటర్, ఓల్డ్ ఏజ్ హోమ్, డీ-అడిక్షన్ కేంద్రాలను సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. వృద్ధుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు, డే కేర్ సెంటర్ల నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే కేంద్రం నుంచి మరిన్ని నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ట్రాన్స్‌జెండర్ల కోసం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, కార్ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. దివ్యాంగుల కోసం అమలు చేస్తున్న సమగ్ర సంక్షేమ పథకాలు, ఆధునిక సదుపాయాల కల్పనను అభినందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తల్లిదండ్రుల సంరక్షణ చట్టం అమలుతో వృద్ధుల భద్రతకు ప్రాధాన్యం పెరిగిందని, ఇది దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వెల్లడించిన ముఖ్యాంశాలు: నగరాల్లో, ముఖ్యంగా హైదరాబాద్‌లో డీ-అడిక్షన్ కేంద్రాల విస్తరణ, యువతను మత్తు పదార్థాల నుంచి దూరం చేయడానికి ప్రత్యేక చర్యలు, మెట్రో స్టేషన్ల భద్రతలో ట్రాన్స్‌జెండర్ల భాగస్వామ్యం, డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ, శిక్షణ కార్యక్రమాలు ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా మత్తు వ్యసన నిర్మూలనపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని, హైదరాబాద్ సహా జంట నగరాల్లో ఆధునిక డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా యువతకు పునరావాసం కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని సుధాంశ్ పంత్ ప్రశంసించారు.

కేంద్రంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను వీలైనంత త్వరగా విడుదల చేస్తామని మంత్రి గారికి హామీ ఇచ్చారు. సంక్షేమ రంగంలో తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధి, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న ఫలితాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని ఈ సందర్భంగా సుధాంశ్ పంత్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్య సాచి ఘోష్, దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్, ఎస్సీ డి డి వీసీ & ఎండీ హనుమంత్ నాయక్, డైరెక్టర్ (FAC,)శ్రీధర్, దివ్యాంగుల శాఖ డైరెక్టర్ శైలజ , TGSWREIS జాయింట్ సెక్రెటరీ సక్రు నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.