- 8,575 కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు
- రైతుల ఖాతాలో 2001.96 కోట్లు జమ
- కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి
- అకాల వర్షాలు సంభవిస్తున్నాయి అప్రమత్తంగా ఉండండి
- అకాల వర్షాలతో రైతాంగం ఇబ్బందులు పడొద్దు
- తడిసిన ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలింపు
అకాల వర్షాలు సంభవిస్తున్నందున ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదురుకోకుండా చూడాలని అందుకు అన్ని వైపులా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సోమవారం మద్యాహ్నం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లాల ఇంచార్జ్ మంత్రులు ,కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులతో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి లతో కలసి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర,రవాణా శాఖా కమిషనర్ కె.ఇలంభర్తీ,కార్మిక ,ఉపాధి మరియు విపత్తు నిర్వహణ శాఖా కార్యదర్శి హరిచందన తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రబీ సీజన్ లో పెరిగిన ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఇప్పటి వరకు కోటి 84 లక్షల మంది రైతుల నుండి 14.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు ఆయన వెల్లడించారు. అంతే గాకుండా కొనుగోలు చేసిన ధాన్యానికి గాను ఇప్పటి వరకు రైతుల ఖాతాలో 2001.96 కోట్లు జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కొనుగోలు కేంద్రానికి భారీ ఎత్తున ధాన్యం తరలి రానున్నందున కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అనుసరించాల్సిన పద్దతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ధాన్యం వస్తున్నందున అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
అయితే రాత్రి పడిన అకాల వర్షాలతో సూర్యాపేట,ఖమ్మం, మహబూబాబాద్ వంటి జిల్లాలో 299 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయినట్లు ప్రభుత్వ దృష్టికి సమాచారం వచ్చిందన్నారు. తడిసిన బియ్యాన్ని తక్షణమే బియ్యం మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రాబోయే 3-4 రోజులు అకాల వర్షాలు సంభవించే అవకాశం ఉందంటూ
ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి చేసిన సూచనను అధికారులు తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అకాల వర్షాల ప్రభావం రైతుల మీద చూపకుండా వాతావరణ పరిస్థితులకనుగుణంగా కొనుగోలు కేంద్రాలలో టార్బాలిన్ లను వినియోగించేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. అకాల వర్షాలు సంభవించినప్పుడు ఆ ప్రభావం కొనుగోళ్ల పై చూపకుండా రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. వాతావరణ పరిస్థితుల కనుగుణంగా కొనుగోలు ప్రక్రియను కొనసాగించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.