- శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న ఉన్న 25శాతం కొనుగోలు పరిమితిని ఎత్తివేయాలి
- రైతులకు మద్ధతు ధర అందించేందుకు కేంద్రం రాష్ట్రాలకు తోడ్పాటు అందించాలి
- కేంద్ర మంత్రిని లేఖ ద్వారా మరోమారు కోరిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మొక్కజొన్న, జొన్న పంటలను పిఎస్ఎస్ స్కీంలో చేర్చి, శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25శాతం కొనుగోలు పరిమితిని ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని మరోమారు లేఖద్వారా కోరారు. రాష్ట్రంలో యాసంగిలో పండించిన వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి పంటలపై ఉన్న 25 శాతం కొనుగోలు పరిమితులను కేంద్రం ఎత్తివేయాలని మంత్రి అన్నారు. కేంద్ర పరిమితులతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మిగిలిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కోనుగోలు చేయడంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని వివరించారు. సెంట్రల్ పూల్ లో కేంద్ర నోడల్ సంస్థ ద్వారా శనగ పంటను 29,860 మెట్రిక్ టన్నులు (మొత్తం ఉత్పత్తిలో 25శాతం) కొనుగోలు చేయడానికి, అలాగే పొద్దుతిరుగుడు కొనుగోలు పరిమితిని 3690 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి కేంద్రం అనుమతించిందని, అయితే కేంద్రం అనుమతించిన పరిమితి ప్రకారం కొనుగోలు గత వారమే పూర్తయ్యాయని అన్నారు. ఇంకా రైతుల వద్ద పంట మిగిలివుందని, కొనుగోళ్ల కోసం మార్కెట్లకు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం అనుమతించిన పరిమితులను ఇప్పటికే దాటినందున, శనగ పంటల కొనుగోలు పరిమతిని 1,12,077 మెట్రిక్ టన్నులకు పెంచాలని, పొద్దుతిరుగుడు పంటల కొనుగోళ్లను 10,839 మెట్రిక్ టన్నులకు పెంచాలని మంత్రి కోరారు.
తెలంగాణలో విస్తృతంగా పండే మొక్కజొన్న, జొన్న పంటను కేంద్రం పిఎస్ఎస్ స్కీంలో చేర్చి, కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేపట్టాలని మంత్రిగారు డిమాండ్ చేశారు. ఈ రబీ సీజన్ లో 11.21 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయడం జరిగిందని, అనుకూల వాతావరణ పరిస్థితులతో ఈ సీజన్లో ఎకరానికి 26.57 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని అన్నారు. జొన్న కూడా 3.68 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరిగిందని, ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్టు తెలిపారు. మార్కెట్లకు రైతులు తమ జొన్న పంటను తీసుకురావడం మొదలుపెట్టారని అన్నారు.
మార్కెట్లో గిట్టుబాటు ధర రానందున రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్ల కోసం 246 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రస్తుత రబీ సీజన్లో సుమారు 3.99 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను MSP వద్ద కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. గత ఖరీఫ్ సీజన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3.76 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసి రూ.902.80 కోట్ల వ్యయం భరించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని ధర మద్దతు పథకం (PSS)లో మొక్కజొన్న, జొన్న పంటలను చేర్చాలని అన్నారు. మొక్కజొన్న పంటను కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా 14.89 లక్షల మెట్రిక్ టన్నుల (1,48,99,520 క్వింటాళ్లు) కొనుగోలు చేసేందుకు, 2.76 లక్షల మెట్రిక్ టన్నుల (2,76,277 క్వింటాళ్లు) జొన్న పంటను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇది రైతులకు MSP హామీ కల్పించి, తక్కువ ధరలకు అమ్మకాల పరిస్థితిని నివారించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.