రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్‌ అసిస్టెంట్‌

ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి రూ. 5 లక్షలు లంచం డిమాండ్‌ చేసిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం పట్టుకున్నారు. అందులో భాగంగా రూ. లక్ష లంచం నగదు తీసుకుంటుండగా, ఆమెను రెడ్‌ హ్యాండెడ్‌గా అరెస్ట్‌ చేశారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌ జోన్‌, బోరబండ సరిల్‌-37 డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో శ్రీలత జూనియర్‌ అసిస్టెంట్‌ (రెవెన్యూ/టాక్స్‌)గా పనిచేస్తున్నారు. ఓ ఫిర్యాదుదారుడు తన ఇంటి నిర్మాణ అనుమతికి మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఫైలును ప్రాసెస్‌ చేసి అనుమతి పత్రాలు అందజేయడానికి శ్రీలత రూ. 5 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. అంత ఇచ్చుకోలేనని బాధితుడు వాపోవడంతో, తొలి విడతగా రూ. లక్ష ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో యూసుఫ్‌ గూడ చెక్‌ పోస్ట్‌ సమీపంలోని రత్నదీప్‌ సూపర్‌ మారెట్‌ వద్ద శ్రీలత ఆ నగదును తీసుకుంటుండగా, ఏసీబీ సిటీ రేంజ్‌-1 అధికారులు పట్టుకున్నారు. ఆమె నుంచి నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు.. అరెస్ట్‌ చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.