ఎరువుల కంపెనీల ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష

  • మే నెలాఖరు వరకు 3.00 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉంచుకోవాలి
  • రామగుండం ఎరువుల కర్మాగారం నుండి రాష్ట్రానికి కనీసం 90 శాతం సరఫరా చేయాలి
  • రైతులకు నానో యూరియాపై కంపెనీలు కూడా అవగాహన కల్పించాలి
  • ఎమ్మార్పి కంటే ఎక్కువ ధరకు ఎరువుల అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాము
  • సేంద్రియ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సహకాలు అందించాలి.
  • రాష్ట్ర ఫెర్టిలైజర్ యాప్ మార్గదర్శకంగా కేంద్రం సరికొత్త యాప్
  • మే 21 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలలో రెండు జిల్లాల చొప్పున ప్రయోగాత్మకంగా అమలు

హైదరాబాద్ : రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన యూరియా సరఫరా, నిల్వలు మరియు నానో యూరియా వినియోగంపై వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సచివాలయంలో ఎరువుల కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్‌తో పాటు సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ మరియు కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఖరీఫ్ 2026 సీజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం 11.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా, కేంద్రం 10 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించిందన్నారు. ఆ కేటాయింపుల ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నులు, జూలై మరియు ఆగస్టు నెలల్లో నెలకు 1.50 లక్షల మెట్రిక్ టన్నులు, సెప్టెంబర్‌లో 1 లక్ష మెట్రిక్ టన్నుల సరఫరా ఉంటుందని కేంద్రం తెలిపిందన్నారు. ఏప్రిల్ నెలలో కేటాయించిన 2 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 1.53 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే రాష్ట్రానికి చేరాయని, మే నెలలో ఇప్పటివరకు 48,985 మెట్రిక్ టన్నులు అందాయని అధికారులు వివరించారు.

జూన్ మొదటి వారంలో రాష్ట్రంలో వరి నాట్లు ప్రారంభమయ్యే అవకాశమున్నందున, మే నెలాఖరు నాటికి కనీసం 3.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన మిగిలిన యూరియాను అత్యవసరంగా రాష్ట్రానికి తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోనే ఉన్న రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 90 శాతం తెలంగాణ అవసరాలకే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్ర వనరులను వినియోగించి ఇక్కడే ఉత్పత్తి జరుగుతున్న యూరియా, రాష్ట్ర రైతులకు అవసరమైన సమయంలో అందకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ అంశంపై రామగుండం ఎరువుల కర్మాగారం మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. గత నెలలో కేటాయింపుల మేరకు సరఫరా చేయని కంపెనీలు, మిగిలిన పరిమాణంతో పాటు ఈ నెల కోటాను కూడా సమయానికి సరఫరా చేయాలని మంత్రి స్పష్టం చేశారు. రేక్ పాయింట్లకు చేరిన యూరియాను జిల్లాలకు తరలించే ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకూడదని, హ్యాండ్లింగ్ మరియు రవాణాలో నిర్లక్ష్యం కనబరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులను హోల్ సేల్ మరియు రిటైల్ లో ఎమ్మార్పి కంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు.

రాష్ట్ర యూరియా యాప్ ను మార్గదర్శకంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎరువులను అందించేందుకు ఒక సరికొత్త యాప్ ను తీసుకువస్తుందని మంత్రి అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలోని రెండు జిల్లాలలో ఈ యాప్ ను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. మన రాష్ట్రంలో రంగారెడ్డి మరియు మేడ్చల్ జిల్లాలలో ఈ యాప్ ను అమలు చేయనున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. నానో యూరియా తయారీ సంస్థలు కూడా అవగాహన కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. నానో యూరియా వాడుతున్న రైతుల అనుభవాలను వీడియో రూపంలో చిత్రీకరించి “రైతు నేస్తం” కార్యక్రమంలో ప్రసారం చేయాలని సూచించారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు పాల్గొని, సాధారణ యూరియా అధిక వినియోగం వల్ల కలిగే నష్టాలు, నానో యూరియా ప్రయోజనాలపై రైతులకు వివరించాలని ఆదేశించారు.

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలని మంత్రి కోరారు. రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. యూరియాను అధికంగా వినియోగించడం వల్ల భూసారం దెబ్బతిని, భవిష్యత్తులో దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందన్నారు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకొని, ఆ ఫలితాల ఆధారంగా అవసరమైన ఎరువులను మాత్రమే వినియోగిస్తే భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్, అగ్రికల్చర్ & ఫార్మర్స్ వెల్ఫేర్ డిజిటల్ వింగ్ డైరెక్టర్ సరితా లక్ష్మీ, వ్యవసాయశాఖ డైరెక్టర్ డా. గోపి, ఎరువుల కంపెనీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.