బండి సంజయ్‌ కొడుకు కేసులో ప్రత్యేక అధికారితో విచారణ

 కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విచారణ కోసం ప్రత్యేక అధికారిని నియమించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంపై డీజీపీ సీవీ ఆనంద్‌తో సమీక్షించానని, వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించానని చెప్పారు. అయితే బాధితురాలు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, బండి భగీరథ్‌ కరీంనగర్‌లో ఫిర్యాదు చేశాడని తెలిపారు. దీంతో రెండు ఫిర్యాదులపైనా ప్రత్యేకంగా విచారణ చేయాలని సూచించినట్టు పేర్కొన్నారు. సోమవారం మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. బాధితురాలు ఈ నెల 8నే ఫిర్యాదు చేసినా చర్యలు ఎందుకు తీసుకోలేదని డీజీపీని ప్రశ్నించినట్టు తెలిపారు. అయితే ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో దాదాపు 10 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందని, ఆ ఏర్పాట్లలో నిమగ్నం కావడం వల్లే జాప్యం జరిగిందని డీజీపీ చెప్పారని పేర్కొన్నారు. ఇప్పుడు విచారణ ప్రారంభమవుతోందని, విచారణ తరువాత పోలీసులు చర్యలు తీసుకుంటారని అన్నారు. అయితే బీఆర్‌ఎస్‌ వాళ్లు కోరుతున్నట్టు క్షణాల మీద ఏదీ జరగదని, ఎవరిపైనైనా చట్ట ప్రకారమే చర్యలుంటాయని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ గతంలో పోలీస్‌శాఖలో పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. భగీరథ్‌పై ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసిందీ పోలీసులేనని, ఈ విషయం ప్రవీణ్‌కుమార్‌కు తెలియదా? అని ప్రశ్నించారు.