హరిత నిధి 7వ రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గతంలో మంజూరైన ప్రాజెక్టుల అమలు పురోగతిని మంత్రి సమీక్షించగా, పలు కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. నర్సరీల ఏర్పాటు, అర్బన్ పార్కుల అభివృద్ధి, అటవీ సంరక్షణ, అటవీ పరిశోధనలు, శిక్షణా కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు, ఎకోటూరిజం అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలకు సమావేశంలో ఆమోదం లభించింది.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు హరిత నిధి కీలక వేదికగా పనిచేస్తోందన్నారు. అడవుల సంరక్షణతో పాటు పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ప్రాజెక్టు సమర్థవంతంగా అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులతో పాటు కొత్తగా మంజూరైన ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే విధంగా ప్రాజెక్టులను రూపకల్పన చేసి, పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. అటవీ సంపదను కాపాడడం, జీవ వైవిధ్య పరిరక్షణ, ఎకోటూరిజం అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి హరిత నిధి లక్ష్యాలను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.