- భూగర్భ జలాల పెరుగుదలకూ దోహదమన్న హైడ్రా కమిషనర్
“గొలుసుకట్టు చెరువులకు పెట్టింది పేరు మన హైదరాబాద్. లేక్‌సిటీగా పేరున్న ఈ మహానగరంలో మొత్తం 1384 చెరువులుంటే ఇందులో 625 చెరువుల జాడ కనిపించడంలేదు. ఉన్న 759 చెరువులుకూడా ఆక్రమణలకు గురై కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్నాయి. ఉన్న చెరువులను పరిరక్షించడమే కాకుండా.. కనుమరుగైన చెరువుల జాడ తెలుసుకుని అన్నిటినీ పునరుద్ధరించడమే హైడ్రా లక్ష్యం. గొలుసుకట్టు చెరువుల లింకును తిరిగి అనుసంధానించి వరదల కట్టడికి హైడ్రా కృషి చేస్తోంది. చెరువుల చెంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యం… ఆ దిశగా హైడ్రా పని చేస్తోంది” అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. శుక్రవారం “వే2న్యూస్” కాన్క్లేవ్లో పాల్గొన్న హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు మాట్లాడారు. నగర భవిష్యత్తు, చెరువుల పరిరక్షణ, అర్బన్ ఫ్లడింగ్ వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్‌లోని గాలి వానతో అనేకమంది మృతి చెందారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నప్పుడే ఇలాంటి ఉపద్రవాలు సంభవిస్తాయి. అందుకే ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పర్యవరణ హితమైన నగర నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం… ఆ దిశగా హైడ్రా ముందుకు సాగుతోంది. వరదల సమస్యకు చెరువులు, నాలాల ఆక్రమణలే ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో మొదటివిడతగా 6 చెరువులను అభివృద్ధి చేశాం. మరో 14 చెరువుల అభివృద్ధిని ప్రారంభించాం. నగరం నలుమూలలా ట్యాంక్బండ్లుండాలనేది ప్రభుత్వ లక్ష్యం ఆ దిశగా.. 4 పెద్ద చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఇలా చెరువులన్నీ అభివృద్ధి చెంది.. వాటి చెంత పార్కులు, గ్రీనరీ పెరిగితే పర్యావరణహితమైన నగర నిర్మాణం జరుగుతుంది. చెరువుల చెంత పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఓపెన్ జిమ్‌లు పెడుతున్నాం. చెరువు చుట్టూ బండ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని వయసుల వారూ చెరువుల చెంత సేదదీరేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మురికి కూపాలుగా ఉన్న చెరువులు పర్యాటక ప్రాంతాలుగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన అంబర్‌పేటలోని బతుకమ్మకుంట, కూకట్పల్లి నల్లచెరువు, పాతబస్తీలోని బమృకున్ ఉద్ దౌలా చెరువులను పరిశీలిస్తే ప్రయోజనాలు అందరికీ అర్థమౌతాయన్నారు. HYDRAA 10 సంవత్సరాల రోడ్‌మ్యాప్‌లో కనీసం 1300 చెరువులను పునరుద్ధరించి అభివృద్ధి చేయగలిగితే భూగర్భ జలాల స్థాయి పెరిగి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని హైడ్రా కమిషనర్ తెలిపారు. వరద కాలువల పునరుద్ధరణను కూడా పెద్దయెత్తున చేపట్టామన్నారు. ప్యాట్నీ నాలా ఆక్రమణలు తొలగించడంతో వరద సాఫీగా సాగుతోంది. పైన ఉన్న 20కి పైగా కాలనీలకు వరద ముప్పు తప్పించామని చెప్పారు. డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు.. పర్యావరణ పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తోందని చెప్పారు.