తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని, వారి విధుల విషయంలో కూడా స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని కాంగ్రేస్ ప్రభుత్వం వివిధ బిసి కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని, వీటి ద్వారా ఆయా కులాల అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని వెల్లడించారు. పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్ గా దొంగరి వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ గా బుడగం శ్రీనివాస్ శుక్రవారం హైదరాబాద్ లోని సంక్షేమ భవన్ లో రాష్ట్ర బిసి కొర్పొరేషన్ కమిషనర్ బాలమాయా దేవి నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బిసి కార్పొరేషన్, బిసి సంక్షేమ శాఖ ద్వారా వివిధ కార్యక్రమాలు అమలు చేసుకుంటూనే, వివిధ కుల కార్పొరేషన్ల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. అన్ని కార్పొరేషన్లకు తప్పక నిధులు కేటాయిస్తామని, వారు ఆ నిధులను ఎలా ఖర్చు చేయాలి, కార్పొరేషన్ బాధ్యతలు ఏమిటి అనే విషయంలో స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో పెరిక కులం అందరికీ ఆదర్శంగా నిలిచే కార్యక్రమాలు చేస్తున్నదని అభినందించారు. కుల ఒక్కటిగా సమైక్యంగా ఉండడంతో పాటు 50 ఏళ్లకు పైగా విద్యార్థుల కోసం హాస్టల్ నిర్వహిస్తున్నదని, కొత్తగా బాలికల హాస్టల్ కూడా నిర్మిస్తుండడం గొప్ప విషయమన్నారు. కోకాపేటలో కూడా పెరిక కులస్తులు స్వయంగా విరాళాలతో ఆత్మగౌరవ భవనం నిర్మించుకుంటున్నారని, దీనికి తప్పక ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి, పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్, మద్దా లింగయ్య, వీర భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.