శారీరక సాక్షరత ప్రాముఖ్యం పెరగాలి: పుల్లెల గోపీచంద్

గచ్చిబౌలి స్టేడియం వేదికగా నిర్వహించిన “యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్–2026” కార్యక్రమంలో పద్మభూషణ్ పురస్కార గ్రహీత పుల్లెల గోపీచంద్ “ఫిజికల్ లిటరసీ” అంశంపై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. తెలంగాణ క్రీడాశాఖ ఆధ్వర్యంలో “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 18 నుంచి 23 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత సాధికారత, ఫిట్‌నెస్ ప్రోత్సాహం ప్రధాన లక్ష్యాలుగా ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ, శారీరక సాక్షరత ప్రాధాన్యత కేవలం క్రీడాకారులకు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి వర్గానికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. యువతలో ఆరోగ్యకర జీవనశైలి, క్రమశిక్షణ, మానసిక దృఢత్వం, క్రీడాస్ఫూర్తి పెంపొందించడంలో ఫిజికల్ లిటరసీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
క్రీడారంగం దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకువచ్చే ముఖ్యమైన రంగాల్లో ముందుంటుందని, ఆరోగ్యవంతమైన సమాజం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డా. ఎ. సోనిబాలా దేవి మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రామీణ స్థాయిలో క్రీడల ప్రోత్సాహంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. “యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్–2026” ద్వారా శారీరక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, క్రీడల్లో సామాజిక భాగస్వామ్యాన్ని విస్తరించడం, రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు సుజాత, రవితేజ, గచ్చిబౌలి స్టేడియం అడ్మినిస్ట్రేటర్ కన్నం మధు, కోచ్‌లు మరియు యువ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.