హైదరాబాద్ : జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం డా.బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రివర్యులు ముందుగా గన్ పార్క్ ను సందర్శించి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్, గన్ పార్కు వద్ద చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ వేడుకల ఏర్పాట్లపై ప్రతి శాఖ నుంచి ఒక నోడల్ అధికారి నియమించి సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్ కు వచ్చే వాహనాలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు.వాటర్ ప్రూఫ్ షామియానాలు, బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖను ఆదేశించారు.
సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ తోపాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను ఆయన ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, జనరేటర్ , నగరంలోని ప్రముఖ ప్రదేశాలైన అసెంబ్లీ, రాష్ట్ర సచివాలయం, చార్మినార్, ప్రజాభవన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లు చేయాలని సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ నెల 25వ తేదీ నుంచి పరేడ్ గ్రౌండ్ వద్ద అన్ని విభాగాలు సంయుక్తంగా రిహార్సల్స్ చేపట్టాలని ఆదేశించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నవీన్ మిట్టల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్, కార్యదర్శి రఘునందన్ రావు, డిజిపి (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్, ఎడిజి (ఇంటలిజెన్స్) విజయ్ కుమార్, టిజి జెన్కో సిఎండి హరీష్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి, జలమండలి ఎండి అశోక్ రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.