భారత రత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మహోన్నత నాయకుడు, మాజీ ప్రధాని, ‘భారత రత్న’ స్వర్గీయ రాజీవ్ గాంధీ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఉన్న తన నివాసంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన రాజీవ్ గాంధీ సేవలు స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… “భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించిన ఘనత, ఆధునిక సాంకేతిక విప్లవానికి నాంది పలికిన దార్శనికుడు రాజీవ్ గాంధీ. దేశంలో ఐటీ, టెలికాం రంగాల్లో నేడు మనం చూస్తున్న పురోగతి ఆయన వేసిన పునాదే. దేశ సమగ్రత, ఐక్యత కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరుడు రాజీవ్ గాంధీ. ఆయన ఆశయ సాధన కోసం, దేశ పురోభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి.” అని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ చూపిన శాంతి, సామరస్యం, లౌకికవాద మార్గంలో నడుస్తూ, బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, అభిమానులు పాల్గొని అంజలి ఘటించారు.