జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 21 మందికి ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారంనాడు నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి కార్యాలయ కాన్ఫరెన్స్ హలులో జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ 5వ సమావేశం చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆర్థిక సహాయం కోసం వచ్చిన 29 దరఖాస్తులను కమిటీ సభ్యులు పరిశీలించి 17 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు, తీవ్ర ప్రమాదాలకు గురైన, దీర్ఝకాలికంగా అనారోగ్యం బారిన పడిన నలుగురు జర్నలిస్టులకు కూడా కమిటీ ఆర్థిక సహాయం మంజూరు చేసింది.
ఈ కమిటీ సమావేశంలో ఎంపికైన 17 మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం, అలాగే ఆయా కుటుంబాలకు ప్రతి నెల మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఐదు సంవత్సరాల పాటు అందజేస్తామని ఆయన తెలిపారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలలో ఎల్.కే.జి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు ఒక వెయ్యి రూపాయల చొప్పున ట్యూషన్ ఫీజును మంజూరు చేస్తున్నట్లు ఆయన వివరించారు. నలుగురు అనారోగ్యం బారిన పడిన వర్కింగ్ జర్నలిస్టులకు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీ సమావేశంలో సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ డి.ఎస్. జగన్, మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణ చందర్ రావు, మేనేజర్ డి.ఆర్.ఎస్. శైలెశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.