- నియమ నిబంధనలకు విరుద్ధమైన స్థలాలపై ముందుగానే నోటీసులు ఇవ్వాలి
- అధికారులు – పోలీసులు సమన్వయంతో పని చేయాలి
- అనవసరంగా దళిత సంఘాల నాయకులపై కేసులు నమోదు చేయడం సరికాదు
- సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయ సంకల్పానికి అనుగుణంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం
- అంబేద్కర్ – ఫూలే – జగజీవన్ రామ్ ఆశయాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి మార్గదర్శకం
- సమస్యల పరిష్కారంపైనే ప్రధాన దృష్టి సారించండి
- మహనీయుల విగ్రహాల ఏర్పాట్లలో ఎదురవుతున్న సమస్యలపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో..
హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా ఫూలే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబూ జగజీవన్ రామ్ వంటి మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనలో ఎదురవుతున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల, తెగల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మహనీయుల విగ్రహాలు కేవలం శిల్పాలు కావని, అవి సామాజిక చైతన్యానికి, స్వాభిమానానికి, రాజ్యాంగ విలువలకు ప్రతీకలని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దళితులు, గిరిజనులు, బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి అత్యంత కట్టుబడి పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. సమాజంలోని అణగారిన వర్గాలకు గౌరవప్రదమైన స్థానం కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనలో ఎదురవుతున్న ఇబ్బందులపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మంత్రి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో దళిత సంఘాల ప్రతినిధులు, యువకులు, ప్రజా సంఘాల నాయకులు విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి ఎదురవుతున్న స్థల సమస్యలు, అనుమతుల జాప్యం, స్థానిక స్థాయిలో తలెత్తుతున్న అభ్యంతరాలు, పోలీసు అనుమతులు, రెవెన్యూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… మహనీయుల ఆశయాలను గ్రామస్థాయి నుంచి యువతలోకి తీసుకెళ్లే ప్రక్రియలో విగ్రహాల ప్రతిష్టాపనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశాలలో అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రాహుల్ గాంధీ చేపట్టిన “భారత్ జోడో యాత్ర” దేశంలో సామాజిక ఐక్యత, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం లక్ష్యాలతో సాగిందని మంత్రి పేర్కొన్నారు. ఆ యాత్రలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలే, బాబూ జగజీవన్ రామ్ వంటి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లే స్పూర్తి ప్రతిబింబించిందన్నారు. సమానత్వం, సోదరభావం, హక్కుల పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మూలాధారమని చెప్పారు. విగ్రహాల ప్రతిష్టాపనలో ఎలాంటి అనవసర జాప్యం జరగకుండా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను చట్టబద్ధంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని సూచించారు.
నియమ నిబంధనలకు అనుగుణంగా లేని స్థలాల విషయంలో ముందుగానే సంబంధిత సంఘాలకు స్పష్టమైన నోటీసులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. చివరి నిమిషంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, దళిత సంఘాలతో చర్చించి ముందస్తు పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనవసరంగా దళిత సంఘాల నాయకులపై కేసులు నమోదు చేయడం సరికాదని మంత్రి స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంపైనే ప్రధాన దృష్టి పెట్టాలని, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల మనోభావాలను గౌరవించాలని అధికారులకు సూచించారు. ఎక్కడైనా వివాదాస్పద పరిస్థితులు నెలకొంటే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు కట్టుబడి పనిచేస్తోందని, మహనీయుల ఆశయాల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన రాజ్యాంగ మార్గం, మహాత్మా ఫూలే సూచించిన సామాజిక సమానత్వ భావన, బాబూ జగజీవన్ రామ్ అందించిన ప్రజాస్వామ్య స్పూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (వెల్ఫేర్) సభ్యసాచి ఘోష్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి, ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్, హైదరాబాద్ డీసీపీ-II కాజల్, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కె. చంద్రారెడ్డి, ఏసీఎల్బీ జి. జితేందర్ రెడ్డి, ఎస్సీడీడీ వీసీ & ఎండీ (ఎఫ్ఏసీ) హనుమంత్ నాయక్, ఎస్సీడీడీ డిప్యూటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, రామారావు, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ సంతోష్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో, ఎల్బీనగర్ సీపీ శ్రీనివాస్ యాదవ్, సైబరాబాద్ ఎస్బీ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర, ఓఎస్డీ వై .జే. విజయ్ కుమార్ తదితర అధికారులతో పాటు ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు దొమ్మాటి సుదర్శన్ బాబు, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రాం ప్రసాద్, కళానిధి మాస్టర్ జీ, నల్ల సూర్యప్రకాశ్, సొసైటీ ఫర్ సోషల్ జస్టిస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జీటీ శేఖర్, ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎస్. నాను, జి.బి. శ్యామ్ రావు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ & బాబూ జగజీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గోపాల్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వీకర్ సెక్షన్ అసోసియేషన్ (ఆదర్శ్‌నగర్) తాలూకా అనిల్, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ కుర్మల్‌గూడ నాయకులు సంగం మహేష్, కుర్మ మహేందర్, రాపాక అశోక్ తదితర దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.