థ్రెడ్ పోచంపల్లి ఎగ్జిబిషన్ ద్వారా నేతన్నల ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • చేనేత కార్మికుల శ్రమకు తగిన గౌరవం, ఆదాయం దక్కాలి
  • యాదాద్రి భువనగిరి జిల్లాలో వేలాది కుటుంబాలకు అండగా చేనేత వృత్తి
  • జీఐ ట్యాగ్‌తో తెలంగాణ ఖ్యాతిని చాటుతున్న చేనేత కళ
  • స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని మంత్రి పిలుపు
  • నేతన్నల కృషితో ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం
  • చేనేత ఉత్పత్తులకు కొత్త అవకాశాలు కల్పించే హ్యాండ్లూమ్ ఎక్స్‌పో
  • నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

హైదరాబాద్ : “పోచంపల్లి నేతన్నలు అగ్గిపెట్టెలో పట్టేంత సన్నని చీరలను నేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అందుకే పోచంపల్లి ‘సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా’గా ఖ్యాతి గడించింది. ఈ ఎగ్జిబిషన్ ద్వారా చేనేత కార్మికులకు మరిన్ని మార్కెటింగ్ అవకాశాలు, వారి శ్రమకు తగిన ఆదాయం లభించాలి.” మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. థ్రెడ్ పోచంపల్లి చేనేత కళా వైభవాన్ని ప్రపంచానికి మరింత చేరువ చేసే లక్ష్యంతో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జూన్ 6, 7, 8 తేదీలలో నిర్వహిస్తున్న థ్రెడ్ పోచంపల్లి హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్‌లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టెక్స్టైల్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సహకారంతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. చేనేత కార్మికుల అపూర్వ నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు వారికి మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్‌ను సందర్శించిన మంత్రి, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, హ్యాండ్లూమ్స్ శాఖ అధికారులు, చేనేత సహకార సంఘాలు, మాస్టర్ వీవర్లు, టై అండ్ డై సంఘాలు, చేనేత సోదరులు, అలాగే ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతన్నలందరికీ అభినందనలు తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 12 వేల మంది చేనేత కార్మికులు, అనుబంధ వృత్తిదారులు తమ జీవనోపాధిని ఈ రంగంపైనే ఆధారపడి కొనసాగిస్తున్నారని మంత్రి తెలిపారు. వారి కష్టానికి తగిన గుర్తింపు, ఉత్పత్తులకు విస్తృత మార్కెట్, మెరుగైన ఆదాయం కల్పించాలనే లక్ష్యంతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు.
సుమారు 100 చేనేత స్టాల్స్‌తో పాటు స్వయం సహాయక సంఘాలు, అనుబంధ సంస్థల స్టాల్స్ ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారులకు చేనేత ఉత్పత్తుల వైవిధ్యాన్ని పరిచయం చేస్తున్నారని చెప్పారు. పోచంపల్లి ఇక్కత్, పుట్టపాక తెలియా రుమాలు వంటి భౌగోళిక గుర్తింపు (GI) పొందిన ఉత్పత్తులు యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయని మంత్రి పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ చేనేత కళ, నేతన్నల అపూర్వ నైపుణ్యం, సంప్రదాయ వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా నిలుస్తుందన్నారు. పోచంపల్లి నేతన్నల ప్రతిభ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని మంత్రి కొనియాడారు. అగ్గిపెట్టెలో పట్టేంత సన్నని చీరలను నేసి తమ కళాత్మకతను చాటుకున్నారని, వారి నైపుణ్యం వల్లే పోచంపల్లి “సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా”గా ఖ్యాతి గడించిందన్నారు.

నిజాం కాలం నుంచే పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు ఉందని, అరబ్ దేశాలకు తెలియా రుమాళ్లు, గాజులు, పూసలు ఎగుమతి చేసిన ఘన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందన్నారు. భారతదేశ సామాజిక చరిత్రలో కూడా పోచంపల్లికి ప్రత్యేక స్థానం ఉందని మంత్రి గుర్తుచేశారు. 1951 ఏప్రిల్ 18న ఆచార్య వినోబా భావే ఇక్కడే భూదానోద్యమాన్ని ప్రారంభించారని, ఆయన పిలుపుతో వెదిరె రామచంద్రారెడ్డి 100 ఎకరాల భూమిని పేదలకు దానం చేయడం ద్వారా సామాజిక చైతన్యానికి నాంది పలికారని పేర్కొన్నారు. ఇక్కడి నేతన్నలు ఇక్కత్, డబుల్ ఇక్కత్ పద్ధతుల్లో పత్తి, పట్టు, సికో వస్త్రాలను తయారు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని తెలిపారు. దారాలకు ముందుగానే ప్రత్యేక డిజైన్లు కట్టి రంగులు అద్దిన అనంతరం మగ్గంపై నేసి, చీరకు ఇరువైపులా ఒకే నమూనా కనిపించేలా రూపొందించడం వారి అసాధారణ నైపుణ్యానికి నిదర్శనమన్నారు. ఈ విశిష్ట కళకు గుర్తింపుగా 2003లో జీఐ ట్యాగ్ లభించిందని చెప్పారు. పోచంపల్లి, పుట్టపాక, కోయల్‌గూడం, సిరిపురం, భువనగిరి, గట్టుప్పల, చౌటుప్పల్ ప్రాంతాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అనేక గ్రామాల్లో వేలాది కుటుంబాలు చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయని మంత్రి తెలిపారు. చేనేత రంగంలో విశేష సేవలు అందించి పద్మశ్రీ పురస్కారాలు పొందిన గజం గోవర్ధన్, గజం అంజయ్య, అలాగే ఆసు యంత్రాన్ని అభివృద్ధి చేసి చేనేత కార్మికుల శ్రమను తగ్గించిన చింతకింది మల్లేశం సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పోచంపల్లి చీరలకు ఉన్న అంతర్జాతీయ గుర్తింపుకు నిదర్శనంగా ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది వాటిని ధరిస్తున్నారని, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పోచంపల్లి వస్త్రాలు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయని మంత్రి పేర్కొన్నారు. “ఒక చీర వెనుక నేతన్న కుటుంబం కష్టం, కళ, జీవన పోరాటం దాగి ఉంటుంది. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం అంటే కేవలం వస్త్రాన్ని కొనుగోలు చేయడం కాదు… ఒక కుటుంబానికి అండగా నిలవడం” అని మంత్రి అన్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా చేనేత కార్మికులకు మరిన్ని మార్కెటింగ్ అవకాశాలు లభించాలని, వారి శ్రమకు తగిన గౌరవం, ఆదాయం దక్కాలని, పోచంపల్లి చేనేత వైభవం ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.