- థ్రెడ్ పోచంపల్లి చేనేత ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ, చేనేత
- నేటి నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగనున్న చేనేత ప్రదర్శన.
- పోచంపల్లి చేనేత కళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “Telangana Rising” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన “ థ్రెడ్ పోచంపల్లి” (Thread Pochampally ) చేనేత వస్త్ర ప్రదర్శనను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోచంపల్లి ఇక్కత్ చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇక్కడి నేతన్నల నైపుణ్యం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన చేనేత సంప్రదాయాన్ని భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు లభించిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ ఇక్కడి కళాకారుల సృజనాత్మకతకు, నైపుణ్యానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపని మంత్రి తెలిపారు. భూదాన్ ఉద్యమానికి చారిత్రక కేంద్రంగా నిలిచిన పోచంపల్లికి ప్రత్యేక స్థానం ఉందని, పోచంపల్లి రుమాళ్లు, ఇక్కత్ చీరలకు ప్రపంచ మార్కెట్‌లో మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండున్నర సంవత్సరాల్లో చేనేత రంగం అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం సుమారు రూ.1,400 కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. నేతన్నల ఉపాధికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
గ్లోబలైజేషన్ పోటీని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ సంస్థ ద్వారా చేనేత కుటుంబాల పిల్లలకు ఆధునిక డిజైన్లు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవసరాలకు అనుగుణమైన శిక్షణ అందించి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. డూప్లికేట్ ఉత్పత్తుల వల్ల చేనేత బ్రాండ్‌కు కలిగే నష్టాన్ని నివారించడంలో కూడా ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి గారిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనకు మరింత మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా చర్యలు తీసుకుని చేనేత కళాకారులకు ప్రోత్సాహం అందించాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, చేనేత కార్మికులు మరియు పెద్ద సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు.