- శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల
- దేశానికే ఆదర్శంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటుకానున్న కోహెడా అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్
- తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ రంగంలోనే ఇది ఒక మైలురాయి
- భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి మార్కెట్ నిర్మాణం
- రైతులకు, వ్యాపారులకు, వినియోగదారులకు సమగ్ర సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి
హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ రంగ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవనున్న కోహెడా అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో శంకుస్థాపన ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రూ.3,367.35 కోట్ల వ్యయంతో 239 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న కోహెడా అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్నదని తెలిపారు. రైతు సంక్షేమం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, ఆధునిక మార్కెటింగ్ సదుపాయాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. రైతు పండించిన ప్రతి ఉత్పత్తికి మార్కెట్ హామీ కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడం, రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. వ్యవసాయ మార్కెటింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే దూరదృష్టితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు దశాబ్దాల వరకు మార్కెట్ అవసరాలను తీర్చగలిగే విధంగా ఈ మార్కెట్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణలో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ ఇప్పటికే దేశంలోనే ఆదర్శవంతమైన వ్యవస్థగా ఎదిగిందని మంత్రి పేర్కొన్నారు. 1962లో ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో 206 వ్యవసాయ మార్కెట్ కమిటీలు, 79 ఉప మార్కెట్ యార్డులు పనిచేస్తున్నాయని, ప్రతి సంవత్సరం సుమారు రూ.80 వేల కోట్ల విలువైన వ్యవసాయ వాణిజ్య కార్యకలాపాలు ఈ మార్కెట్ల ద్వారా జరుగుతున్నాయని తెలిపారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణ, మార్కెట్ల అభివృద్ధి, ధరల సమాచార ప్రచారం, రైతు బజార్ల నిర్వహణ, కనీస మద్దతు ధర కొనుగోళ్లకు అవసరమైన సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలను మార్కెట్ కమిటీలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు.
హైదరాబాద్ పండ్ల మార్కెట్ అభివృద్ధి ప్రయాణంలో జాంబాగ్, గడ్డిఅన్నారం, బాటసింగారం మార్కెట్లు కీలక పాత్ర పోషించాయని మంత్రి గుర్తు చేశారు. అయితే పండ్ల వ్యాపారం, రవాణా, వినియోగం గణనీయంగా పెరగడంతో ప్రస్తుతం ఉన్న సదుపాయాలు భవిష్యత్ అవసరాలకు సరిపోవని స్పష్టమైందన్నారు. ఈ నేపథ్యంలోనే కోహెడాలో అత్యాధునిక సదుపాయాలతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.65 లక్షల మంది పండ్ల రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం 5.30 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న మార్కెట్ సామర్థ్యం 15.53 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగనుండగా, పండ్ల వ్యాపార పరిమాణం రూ.1,277 కోట్ల నుంచి రూ.7,765 కోట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం 341 మంది వ్యాపారులు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా భవిష్యత్తులో వారి సంఖ్య 967కు చేరుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ మార్కెట్ ద్వారా సుమారు 16,450 మంది వినియోగదారులకు సేవలు అందుతుండగా, భవిష్యత్తులో 53 వేల మందికి పైగా వినియోగదారులకు సేవలందించే స్థాయికి అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ మార్కెట్ యార్డులో పండ్లతో పాటు పూలు, డ్రై ఫ్రూట్స్, డెయిరీ ఉత్పత్తులు, ఫ్రోజన్ ఫుడ్స్, చేపలు, మాంస ఉత్పత్తుల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 3,661 మంది పూల రైతులకు ప్రత్యేక పూల మార్కెట్ ద్వారా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులు, ఎగుమతిదారుల అవసరాలను ఒకే వేదికపై తీర్చగల సమగ్ర మార్కెట్ వ్యవస్థగా కోహెడా మార్కెట్ రూపుదిద్దుకోనుందని మంత్రి తెలిపారు. నిల్వ, గ్రేడింగ్, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్, రవాణా, మార్కెటింగ్ సేవలు ఒకేచోట అందుబాటులోకి రావడం ద్వారా పంటల వృథా, ఆహార నష్టం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. రైతులకు ధరల సమాచారం మరింత పారదర్శకంగా అందుబాటులోకి రావడంతో పాటు మెరుగైన ఆదాయం లభిస్తుందని, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఈ మార్కెట్ నిర్మాణానికి రూ.3,367.35 కోట్లు అంచనా వేయగా, ఇందులో ప్రభుత్వం రూ.2,284.31 కోట్లు పెట్టుబడి పెట్టనుందని, ప్రైవేట్ రంగం ద్వారా రూ.1,083.03 కోట్ల పెట్టుబడులు సమీకరించనున్నట్లు తెలిపారు. మార్కెట్ ప్రాంగణంలో పోలీస్ స్టేషన్, అగ్నిమాపక కేంద్రం, ఆరోగ్య క్లినిక్, హోటళ్లు, విశ్రాంతి కేంద్రాలు, ఆధునిక నిల్వ సదుపాయాలు, శీతలీకరణ కేంద్రాలు తదితర అన్ని వసతులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 14 వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల విలువ వృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, రైతుల ఆదాయ పెంపు లక్ష్యాలతో నిర్మించనున్న కోహెడా అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ రంగాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గణనీయమైన తోడ్పాటును అందించనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.