హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, తాను కలిసి జూన్ 4, 5 తేదీల్లో నిర్వహించిన సాగునీటి ప్రాజెక్టుల పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. సోమవారం రోజున డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిర్ణయించిన గడువులు, లక్ష్యాల అమలుపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. భూసేకరణ, పునరావాసం, విద్యుత్ సరఫరా, కాంట్రాక్టర్ల పనితీరు వంటి అంశాల్లో ఉన్న అడ్డంకులను మిషన్ మోడ్‌లో పరిష్కరించాలని స్పష్టం చేశారు. పాలమూరు ప్రాంత సాగునీటి ప్రాజెక్టుల అమలులో ప్రభుత్వం కొత్త దశలోకి ప్రవేశించిందని, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రతి ప్రాజెక్టులోని ప్రధాన భాగాలకు పూర్తి స్థాయి కార్యాచరణ షెడ్యూల్ సమర్పించాలని చీఫ్ ఇంజనీర్లను ఆయన ఆదేశించారు.
భూసేకరణను సాధ్యమైనంత వరకు పరస్పర అంగీకారంతో పూర్తి చేయాలని, నిర్వాసిత కుటుంబాలకు పునరావాస ప్యాకేజీలు ఆలస్యం లేకుండా అందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం
మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పురోగతిని సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంపింగ్ స్టేషన్ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను పూర్తి చేసి 2027 మార్చి నాటికి అన్ని మోటార్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నార్లాపూర్ రిజర్వాయర్ పరిధిలోని కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, మొత్తం పంపిణీ వ్యవస్థతో సహా ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని ఆయన సూచించారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సమీక్షించిన మంత్రి, నార్లాపూర్, ఏదుల, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల వల్ల నిర్వాసితులైన కుటుంబాలకు పునరావాస చర్యలను అత్యవసరంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. కరివేన రిజర్వాయర్ వరకు ప్రధాన మౌలిక సదుపాయాల నిర్మాణ పనులను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని, నార్లాపూర్, ఏదుల, వట్టెం పంప్ హౌస్‌లకు తక్షణమే విద్యుత్ కనెక్షన్లు కల్పించాలని సూచించారు. భవిష్యత్తులో విద్యుత్ వ్యయాన్ని తగ్గించేందుకు రిజర్వాయర్ల వద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి అవకాశాలపై అధ్యయనం చేపట్టాలని ఆదేశించారు.
మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం
ఈ పథకానికి అవసరమైన సుమారు 2,200 ఎకరాల భూసేకరణ ప్రక్రియను 2026 జూలై నాటికి ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే ప్రతిపాదిత 4,200 ఎకరాల భూసేకరణ, పునరావాస ప్రక్రియలను వేగవంతం చేసి, తొలి దశ పనులను త్వరితగతిన అమలు చేయాలని సూచించారు.
రాజీవ్ భీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలు
రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకానికి సంబంధించి మొదటి దశ పనుల కోసం అవసరమైన మిగిలిన 80 ఎకరాల భూసేకరణను 2026 జూలై నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకానికి అవసరమైన మిగిలిన 167 ఎకరాల భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి, పెండింగ్ పనులన్నింటినీ 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సూచించారు.
జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం
అదనంగా 58 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన 534 ఎకరాల భూసేకరణను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. గూడెందొడ్డి రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచే ప్రతిపాదనలను సమీక్షించిన ఆయన, పంపింగ్ స్టేషన్ల సమీపంలో ఉన్న భూములపై సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు.
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం
ఆర్‌డీఎస్–తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండో దశ పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి, అవసరమైన 567 ఎకరాల భూసేకరణను రైతులతో చర్చలు జరిపి, పరస్పర అంగీకారంతో పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు.
పునరుత్పాదక ఇంధనంపై ప్రత్యేక దృష్టి
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటన సందర్భంగా ప్రతిపాదించిన కార్యక్రమాల అమలుపై కూడా మంత్రి చర్చించారు. ఈ చర్యలు సాగునీటి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, ఎత్తిపోతల పథకాల నిర్వహణలో దీర్ఘకాలిక స్థిరత్వాన్ని కల్పిస్తాయని, సంప్రదాయ విద్యుత్‌పై ఆధారాన్ని తగ్గిస్తాయని ఆయన తెలిపారు.
కఠిన పర్యవేక్షణ వ్యవస్థ
ప్రతి నెల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి, భూసేకరణ, నిధుల అవసరం, కాంట్రాక్టర్ల పనితీరు, నిర్మాణ పురోగతిపై నివేదికలు సమర్పించాలని ఉన్నతాధికారులను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాటలను ఉటంకిస్తూ, పాలమూరు ప్రాంత సాగునీటి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పనితీరు సరిగా లేని కాంట్రాక్టర్లపై నిశితంగా పర్యవేక్షణ కొనసాగుతుందని, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులలో ఎక్కువ భాగాన్ని 2027 నాటికి పూర్తి చేసి, పాలమూరు ప్రాంతం పూర్తి సాగునీటి సామర్థ్యాన్ని సాధించేలా చేయడం, రైతుల దశాబ్దాల కలను సాకారం చేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ. శ్రీధర్, ఇంజినీర్-ఇన్-చీఫ్‌లు, చీఫ్ ఇంజినీర్లు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.