- చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక సమావేశం
- చిచెస్టర్ యూనివర్సిటీలో కోచులకు ఇచ్చే శిక్షణ, క్రీడాకారులకు నైపుణ్యతపై అవగాహన, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలపై మంత్రితో చర్చించారు.
హైదరాబాద్ : తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రతిష్టాత్మక చిచెస్టర్ విశ్వవిద్యాలయం ప్రతినిధులతో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామిక అభివృద్ధి, మత్స్య, క్రీడలు & యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి విద్యా సహకారం, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, ఉన్నత విద్యా అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం మరియు చిచెస్టర్ విశ్వవిద్యాలయం మధ్య విద్యా, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకార అవకాశాలను పరిశీలించారు. రాష్ట్ర యువత అంతర్జాతీయ స్థాయి విద్యను అందిపుచ్చుకుని ప్రపంచ ఉద్యోగ మార్కెట్‌లో పోటీపడేలా భాగస్వామ్య కార్యక్రమాలు రూపొందించాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ప్రతినిధులు తమ విద్యా కార్యక్రమాలు, పరిశోధన అవకాశాలు, అంతర్జాతీయ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ప్రత్యేక పథకాలు, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాల గురించి వివరించారు. తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య, గ్లోబల్ ఎక్స్‌పోజర్ కల్పించేందుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధులను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధి ఒలివియా మెక్‌లాగ్లిన్, సంబంధిత శాఖల అధికారులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.