టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో ‘మహిళా శక్తి క్యాంటీన్’ను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మింట్ కాంపౌండ్‌లోని టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) ప్రధాన కార్యాలయ ఆవరణలో ఉద్యోగుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేయనున్న ‘మహిళా శక్తి క్యాంటీన్’ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం సందర్శించి, పరిశీలించారు.
​క్యాంటీన్ ఏర్పాటుకు అయిన మొత్తం ఖర్చు, అక్కడ ఉద్యోగులకు కల్పించిన వివిధ రకాల వసతులు, మౌలిక సౌకర్యాల గురించి ఆ సంస్థ సీఎండీ జితేష్ వి పాటిల్‌ను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబన, ఉద్యోగులకు పరిశుభ్రమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

​క్యాంటీన్ నిర్వాహకులతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి.. ఉద్యోగులకు, సందర్శకులకు ఎల్లప్పుడూ సరసమైన ధరలకే నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను అందించాలని సూచించారు. అనంతరం క్యాంటీన్‌లో ఏర్పాటు చేసిన మెనూ బోర్డును, ధరల పట్టికను ఆయన నిశితంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సిఎండి జ్యోతి బుద్ధ ప్రకాష్ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు డైరెక్టర్ కమర్షియల్ చక్రపాణి, గారు డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ఐటి శివాజీ గారు , డైరెక్టర్ ఆపరేషన్స్ N.నరసింహ గారు , డైరెక్టర్ ఫైనాన్సు కృష్ణా రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.