మెట్రోపై మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ పెండింగ్‌ అంశాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మెట్రో ఫేజ్‌-2, ఐఆర్‌ఎఫ్‌సీ ఫైనాన్సింగ్‌కు సంబంధించిన అంశాలపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని కోరారు. జూన్‌ 20న ఆయనకు మరో లేఖ రాశారు. జూన్‌ 16న తాను రాసిన లేఖలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌కు సంబంధించిన సమస్యలను ప్రస్తావించానని సీఎం గుర్తుచేశారు. పెండింగ్‌ అంశాలపై త్వరితగతిన పరిష్కారం అవసరమని, అందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు.

జూన్‌ 22, 23 తేదీల్లో తాను ఢిల్లీలో ఉంటానని, ఆ సమయంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని కిషన్‌రెడ్డిని కోరారు. మెట్రో టేకోవర్, ఐఎఫ్ ఆర్ సీ తో రుణ ఒప్పందాలు, మెట్రో ఫేజ్ 2 ప్రతిపాధనల ప్రతులను కూడా తాను తీసుకువస్తానని సీఎం ఈ లేఖ ద్వారా తెలియజేశారు. సమావేశం ఏర్పాటు చేసి తనకు సమాచారం ఇవ్వాలని కిషన్‌రెడ్డిని కోరారు.