పాడి రైతుకు భరోసా: డిప్యూటీ సీం భట్టి విక్రమార్క

  • 27 లక్షల మంది విద్యార్థులకు ‘విజయ’ పాలు
  • పాడి రైతులకు బకాయిల్లేని పేమెంట్లు
  • లాభసాటిగా తెలంగాణ పాడి పరిశ్రమ

రాష్ట్రంలో పాడి పరిశ్రమ మీద ఆధార‌ప‌డి జీనం సాగిస్తున్న రైతుల‌ను ఆదుకోవ‌డంతో పాటు విజ‌యా డైరీనీ ఆర్థికంగా బ‌లోపేతం చేసేందుకు ప్ర‌జాప్ర‌భుత్వం అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. రాష్ట్రంలోని పాడిపరిశ్రమను ఆదుకోవాలని, పాల ఉత్పత్తులపై ఆధారపడిన వారి జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రజాప్రభుత్వం కృత నిశ్చ‌యంతో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటను ఈ సందర్భంగాఆయన పేర్కొన్నారు. ప్ర‌భుత్వ పాఠశాలలు,అంగ‌న్ వాడీ కేంద్రాలకు విజయ డెయిరీ నుంచి పాలను సరఫరా చేయాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాల‌పై ఉప ముఖ్య‌మంత్రి నేతృత్వంలో ఉన్న‌త స్థాయి స‌మీక్షా స‌మావేశం స‌చివాల‌యంలో జ‌రిగింది. ఈ స‌మావేశంంలో డిప్యూటీ సీఎంతో పాటు పశుసంవర్ధక శాఖా మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో రాష్ట్రంలో పాల వినియోగం, సేకరణ, రైతులకు చెల్లించాల్సిన బిల్లులపై లోతైన చ‌ర్చ జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఉన్న పాల వినియోగం, కొత్త‌గా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన మేర‌కు వివిధ పాఠ‌శాల‌ల్లో చ‌దువుకుంటున్న 27 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు పాల‌ను అందించే అంశంపై అధికారుల‌తో చ‌ర్చించారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో మొత్తం పాల ఉత్ప‌త్తికి సంబంధించి ఖ‌చ్చిత‌మైన లెక్క‌లు తీసుకురావాల‌ని అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు. రాష్ట్ర‌వ్యాప్తంగా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పాలిచ్చే పశువుల అసలు సంఖ్యను గుర్తించాల‌ని ఆదేశించారు. పాలిచ్చే ప‌శువుల ద్వారా వస్తున్న వాస్తవ ఉత్పత్తిని లెక్క‌గట్టి సమగ్ర నివేదికను త‌దుప‌రి సమావేశంలో ఇవ్వాల‌ని సంబంధిత అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశించారు.

రైతుల నుంచి సేకరించే పాల ధరపై స్పష్టమైన విధానం ఉండాలన్నారు. రైతుల‌కు బ‌కాయులు లేకుండా ఎప్ప‌టిక‌ప్పుడు బిల్లులు చెల్లించేల‌న్నారు. పాఠశాలలకు సరఫరా చేసే పాలకు సంబంధించిన బిల్లుల‌ను సంక్షేమ శాఖ‌లు నేరుగా ఆయా విభాగాల‌కే బ‌దిలీ చేయాల‌ని చెప్పారు. దీనివ‌ల్ల రైతులకు ఎలాంటి బ‌కాయిలు ఉండ‌వ‌ని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు పాడి ప‌రిశ్ర‌మ మీదే ఆధార‌ప‌డ‌తార‌ని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఈ నేప‌థ్యంలో పాడి రైతుల‌కు స‌మ‌యానికి డ‌బ్బులు చెల్లిస్తే.. వారి కుటుంబం ఆర్థికంగా బ‌లోపేతం అవుతుంది.. డైరీకి న‌మ్మ‌కంతో పాలు పోస్తార‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చేందుకు, పాల ఉత్పత్తుల‌ను గణనీయంగా పెంచేందుకు ఆధునిక ప‌ద్ద‌తుల‌ను అనుస‌రించాల‌ని ఆయ‌న సూచించారు. రైతుల‌కు వ్యవసాయం పైనే కాకుండా, పాడి పరిశ్రమ ద్వారా అదనపు జీవనోపాధి కల్పించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.