విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా శాఖ అధికారి(డీటీవో)ని అతివేగంతో వచ్చిన బొగ్గు టిప్పర్ ప్రాణాలను బలిగొంది. రవాణా శాఖ కార్యాలయం ముందే ఈ ఘటన చోటు చేసుకోగా.. డీటీవో శరీరంపై నుంచి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే కన్నుమూశారు. భూపాలపల్లి జిల్లా గణపురం పరిధిలో సోమవారం జరిగిన సంఘటన.. తీవ్ర విషాదాన్ని నింపింది. భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా మద్దోజు వెంకన్న (47) ఈనెల 4వ తేదీనే బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా జగిత్యాల నుంచి ఇక్కడికి వచ్చారు. హనుమకొండలో నివాసం ఉంటున్న ఆయన సోమవారం ఉదయం భూపాలపల్లి ఆర్టీఏ కార్యాలయానికి కారులో బయల్దేరారు. ఆర్టీవో కార్యాయానికి రెండు కిలో మీటర్ల దూరంలో (మోరంచపల్లి సమీపంలో) ఓ వరి కోత యంత్రం కనిపించగా.. ఆగి పత్రాలను పరిశీలించారు. రోడ్డు పన్ను చెల్లించలేదని గుర్తించి, వరి కోత యంత్రం యజమానిపై కేసు నమోదు చేశారు. హార్వెస్టర్‌ను సీజ్ చేసేందుకు ఆర్టీవో కార్యాలయానికి తరలించారు. ఆర్టీవో కార్యాలయం వద్దకు రాగానే కారు దిగిన డీటీవో వెంకన్న.. వరికోత యంత్రాన్ని లోపలికి పంపించే క్రమంలో రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో తాడిచర్ల నుంచి భూపాలపల్లిలోని కేటీపీపీకి బొగ్గు తీసుకెళ్తున్న టిప్పర్.. అతి వేగంగా వచ్చి ఆయన్ను ఢీకొట్టింది. ఒడిశాకు చెందిన టిప్పర్ డ్రైవర్ మహ్మద్ తస్లీమ్ నిర్లక్ష్యం, అతివేగం వల్ల టిప్పర్ అదుపుతప్పి డీటీవో వెంకన్న పై నుంచీ దూసుకెళ్లింది. టిప్పర్ ముందు చక్రం వెంకన్న పై నుంచి వెళ్లడంతో శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. దీంతో సంఘటన స్థలంలోనే ఆయన కన్నుమూశారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తస్లీమ్‌ను అదుపులోకి తీసుకోవడంతోపాటు టిప్పర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటన స్థలాన్ని ఎస్పీ సంకీర్త్ సందర్శించి వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ గోదావరిఖనిలోని మార్ల్ ట్రాన్స్పోర్ట్ సంస్థకు చెందినదని, ఆ సంస్థ యజమాని మహబూబ్‌ఖాన్ అని పోలీసులు గుర్తించారు. కాగా, డీటీవో వెంకన్న స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా. 2012లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన 18 రోజులకే ఆయన మరణించడం.. విషాదాన్ని నింపింది. వెంకన్నకు భార్య స్వప్న, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.