నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌  కొమ్మూరి మల్లారెడ్డి వద్ద రూ.3 కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

 నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కొమ్మూరి మల్లారెడ్డి ఇంటిపై దాడి చేసిన అవినీతి నిరోదక శాఖ అధికారులు సుమారు రూ. 3 కోట్ల విలువైన అక్రమ ఆస్తులున్నట్లు గుర్తించారు. వీటి విలువ మార్కెట్‌లో అనేక రెట్లు అధికంగా ఉంటుందని ఏసీబీ అధికారులు వివరించారు. మంగళవారం నిజామాబాద్‌లోని కార్యాలయంతో పాటు అతడి ఇంటితో పాటు అతడికి సంబంధించిన 10 మంది బంధువులు, బినామీ వ్యక్తులపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో నాలుగు నివాసపు ఇండ్లు, ఒక కమర్షియల్‌ బ్లాక్‌, 8 ఓపెన్‌ ప్లాట్లు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఈఎస్‌ వద్ద రూ.3.31 లక్షల నగదు, రూ.50 లక్షల బ్యాంక్‌ బ్యాలెన్స్‌, మూడు బ్యాంక్‌ లాకర్లున్నాయని సోదాలో వెల్లడయ్యిందని వివరించారు. విచారణ లో భాగంగా త్వరలో లాకర్లను ఓపెన్‌ చేస్తామన్నారు. వీటితో పాటు ఒక గ్రాండ్‌ విటారా కారు, టీవీఎస్‌ స్కూటీని అక్రమ ఆస్తిగా గుర్తించినట్లు వెల్లడించారు. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచామని, తదుపరి విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.