- డ్రగ్ ఫ్రీ తెలంగాణే లక్ష్యం… గవర్నర్‌తో మంత్రి అడ్లూరి కీలక భేటీ”
- నషా ముక్త్ భారత్ అభియాన్, వృద్ధుల సంక్షేమం, దివ్యాంగుల సాధికారతపై
- గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక చర్చలు
హైదరాబాద్ : మాదకద్రవ్యాల నిర్మూలన, వృద్ధుల సంక్షేమం, దివ్యాంగులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారతకు సంబంధించిన పలు కీలక అంశాలపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లతో షెడ్యూల్డ్ కులాలు, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధులు & ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం లోక్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమం, రాష్ట్రంలో చేపడుతున్న మాదకద్రవ్యాల నిరోధక చర్యలు, యువతలో అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలపై మంత్రి గవర్నర్‌కు వివరించారు. ఈ నెల 26న నిర్వహించనున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు, యువజన చైతన్య కార్యక్రమాల వివరాలను మంత్రి గవర్నర్‌కు తెలియజేశారు.
రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా గవర్నర్ ని మంత్రి ఆహ్వానించారు. అయితే జూన్ 26న ముందస్తు కార్యక్రమాల కారణంగా అందుబాటులో లేనందున, జూలై 2న వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్రంలో అమలవుతున్న నషా ముక్త్ భారత్ అభియాన్ పురోగతిని సమీక్షించారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసు శాఖ సమన్వయంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా వృద్ధుల సంక్షేమం, ఒంటరిగా జీవిస్తున్న సీనియర్ సిటిజన్ల సమస్యలు, “ప్రణామ్” డే కేర్ కేంద్రాల సేవలు, వృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై కూడా చర్చ జరిగింది. దివ్యాంగుల సాధికారతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “బాల భరోసా”, సహాయక పరికరాల పంపిణీ, స్వయం ఉపాధి పథకాలు, దివ్యాంగుల వసతి గృహాలు, ప్రత్యేక పాఠశాలల నిర్వహణ, విద్యా అవకాశాల విస్తరణ తదితర అంశాలపై మంత్రి గారు గవర్నర్‌కు వివరించారు.
ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి అవకాశాల కల్పన, ఆరోగ్య సేవల విస్తరణ వంటి అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. సమాజంలోని అత్యంత బలహీన వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్ గారు అభినందిస్తూ, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం, వృద్ధుల గౌరవప్రద జీవనం, దివ్యాంగులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారతకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, ఐఏఎస్, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీమతి అనితా రామచంద్రన్, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ సంచాలకురాలు శ్రీమతి బి. శైలజ తదితరులు పాల్గొన్నారు.