ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ సమీక్ష

హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ బుధవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు.
వివిధ జిల్లాల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలు తీరును పర్యవేక్షించిన నోడల్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో గుర్తించిన సమస్యలు, సవాళ్లను సిఎస్ కు వివరించారు. అలాగే జిల్లాలలో అమలు చేసిన వినూత్న విధానాలతో సానుకూల ఫలితాలు వచ్చాయని, వాటిని ఇతర జిల్లాల్లో కూడా అమలు చేయవచ్చని సూచించారు. జిల్లా కలెక్టర్లతో చర్చించి సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోడల్ అధికారులను ఆదేశించారు. ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ 99 రోజుల కార్యక్రమంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర వివరాలను అందించారు. కార్యక్రమంలోని వివిధ అంశాల కింద ఇప్పటివరకు సాధించిన పురోగతిని ఆయన వివరించారు. ఈ సమీక్షాసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, నోడల్ అధికారులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.