అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన పిసిసిఎఫ్ వినయ్ కుమార్

  • అటవీదళాల నూతన ప్రధాన సంరక్షణాధికారికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సురేఖ
  • అటవీ సంపద పరిరక్షణ, పచ్చదనం పెంపుదల పై ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణను అమలు చేయాలని నూతన పిసిసిఎఫ్ కు దిశానిర్దేశం
  • అటవీ సంపద సంరక్షణకు విశేష కృషి చేస్తున్న అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం వార్షిక అవార్డుల ఉత్తర్వులు జారీచేయడంలో చొరవ చూపినందుకుగాను మంత్రి సురేఖకు ధన్యవాదాలు తెలిపిన పిసిసిఎఫ్
  • తనను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ పిసిసిఎఫ్ శ్రీమతి సువర్ణను చీరతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపి, అటవీశాఖకు సువర్ణ అందించిన విశిష్ట సేవలను కొనియాడిన మంత్రి సురేఖ

రాష్ట్ర అటవీదళాల నూతన ప్రధాన సంరక్షణాధికారి (పిసిసిఎఫ్)గా బాధ్యతలు స్వీకరించిన వినయ్ కుమార్ ఈ రోజు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖని జూబ్లిహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అటవీ సంపద పరిరక్షణ, అటవీ విస్తీర్ణం పెంపు, జీవ వైవిధ్య సంరక్షణ, సామాజిక అటవీ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడం, ప్రభుత్వ లక్ష్యాలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, తదితర అంశాలపై వీరిరువురు సమగ్రంగా చర్చించారు. అటవీ సంపదను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి సురేఖ పిసిసిఎఫ్ కు సూచించారు.

అటవీ శాఖ కార్యక్రమాల అమలులో సాంకేతికత వినియోగం, అటవీ రక్షణ చర్యల బలోపేతం, పచ్చదనం పెంపుదల, అటవీ అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణను మరింత వేగవంతం చేయాలని మంత్రి వినయ్ కుమార్ కు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అటవీ శాఖ పూర్తి నిబద్ధతతో పనిచేస్తుందని పీసీసీఎఫ్ వినయ్ కుమార్ ఈ సందర్భంగా మంత్రికి హామీ ఇచ్చారు. అడవుల సంరక్షణకు అహర్నిశలు కృషి చేస్తూ, అటవీ సంపదను కాపాడుతున్న అటవీ అధికారులు, సిబ్బందికి ప్రతి ఏటా అవార్డులు, నగదు ప్రోత్సహాకాలు అందించేలా చర్యలు చేపట్టినందుకుగాను పిసిసిఎఫ్ వినయ్ కుమార్ మంత్రి సురేఖకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అటవీ రంగంలో ఈ చర్య మైలురాయిగా నిలుస్తుందని, అటవీ సిబ్బంది సేవలకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు.

మాజీ పిసిసిఎఫ్ ను సత్కరించి, అభినందలను తెలిపిన మంత్రి కొండా సురేఖ
పదవీ విరమణ తర్వాత తనను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ పిసిసిఎఫ్ శ్రీమతి సువర్ణను మంత్రి కొండా సురేఖ చీరతో సత్కరించి, అభినందించారు. అటవీ శాఖకు ఆమె అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. పదవీవిరమానంతర జీవితం సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు.