జూన్ 2028 నాటికి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేస్తాం: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • కార్మికుల భద్రతకు ఎలాంటి రాజీ లేదు
  • ప్రాజెక్టు పూర్తితో 4.01 లక్షల ఎకరాలకు సాగునీరు – 618 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీటి భరోసా
  • టన్నెల్, రిజర్వాయర్లు, కాలువల పనులు సమాంతరంగా పూర్తి చేస్తాం
  • మూడింతలు పెంచిన సిబ్బంది… ఆధునిక యంత్రాలతో పనులు వేగవంతం

హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ రైతుల దశాబ్దాల కల అయిన ఆలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఏఎంఆర్-ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టును జూన్–2028 నాటికి తప్పకుండా పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో టన్నెల్ పనుల్లో పాల్గొంటున్న కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని ఆయన తేల్చిచెప్పారు. సోమవారం రోజున డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి, ఈ ప్రాజెక్టు కేవలం ఇంజినీరింగ్ నిర్మాణం మాత్రమే కాదని, దక్షిణ తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షకు రూపం ఇవ్వడమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం అవసరమైన నిధులు, భూసేకరణ, సాంకేతిక అనుమతులు, పరిపాలనా అనుమతులను వేగంగా పూర్తి చేసి పనులు నిరంతరాయంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. టన్నెల్‌తో పాటు డిండి ప్రాజెక్టు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, కాలువల నిర్మాణాన్ని ఒకే సమగ్ర ప్రాజెక్టుగా భావించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో టన్నెల్ పనులు పునఃప్రారంభించిన తర్వాత ఇప్పటికే అర కిలోమీటర్‌కు పైగా పురోగతి నమోదైందని తెలిపారు. దేవరకొండ వైపు నుంచి పనులు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని, శ్రీశైలం వైపు కూడా అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పనులు సాగుతున్నాయని చెప్పారు. టన్నెల్ పనులను మరింత వేగవంతం చేసేందుకు మూడు అత్యాధునిక ఆర్మ్ బూమర్ యంత్రాలు ముంబై పోర్టుకు చేరాయని, ఈ నెలాఖరులో పనుల ప్రదేశానికి చేరుకుని నిర్మాణ వేగాన్ని మరింత పెంచనున్నాయని వెల్లడించారు. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీల నీటిని తరలించి 4.01 లక్షల ఎకరాలకు సాగునీరు, 618 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు సురక్షిత తాగునీరు, అలాగే పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా అందుతుందని మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టుకు సవరించిన పరిపాలనా అనుమతి వ్యయం సుమారు రూ.12,718 కోట్లు అని తెలిపారు. పనుల వేగం ఎంత ముఖ్యమైనదైనా, కార్మికుల భద్రత దానికంటే ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. టన్నెల్ అంతటా తగిన లైటింగ్, సమర్థవంతమైన వెంటిలేషన్, సీనియర్ జియాలజిస్టులు, అథారిటీ ఇంజినీర్లు, నిపుణుల నిరంతర పర్యవేక్షణతో పనులు కొనసాగించాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలపై ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. టన్నెల్ వద్ద పనిచేసే సిబ్బందిని ఇప్పటికే మూడింతలు పెంచినట్లు, అదనపు యంత్రాలు, ప్రత్యేక పరికరాలు, సాంకేతిక నిపుణులను సమీకరిస్తున్నట్లు తెలిపారు. యంత్రాల రవాణా, కస్టమ్స్ అనుమతులు, సాంకేతిక సిబ్బంది నియామకం వంటి అంశాల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

డిండి ప్రాజెక్టు, నక్కలగండి రిజర్వాయర్, పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, కాలువల నెట్‌వర్క్ పూర్తయితేనే ఎస్‌ఎల్‌బీసీ పూర్తి ప్రయోజనాలు రైతులకు అందుతాయని మంత్రి తెలిపారు. భూసేకరణ పరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. హై లెవల్ కెనాల్, లో లెవల్ కెనాల్, ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం, కాలువల సామర్థ్య పెంపు పనులపైనా సమీక్ష నిర్వహించిన మంత్రి, అవసరమైన చోట కాలువలను విస్తరించి భవిష్యత్తులో అదనపు నీటి ప్రవాహాలను సురక్షితంగా మోయగల విధంగా రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. చివరగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులను జూన్–2028 నాటికి అన్ని విధాలుగా పూర్తి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రాజెక్టులు దక్షిణ తెలంగాణ రైతాంగానికి శాశ్వత సాగునీటి భరోసా, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సురక్షిత తాగునీరు అందించి ఆ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ చూపిస్తాయి” అని అన్నారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ. శ్రీధర్, టన్నెల్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా, ఇంజినీర్-ఇన్-చీఫ్ (జనరల్) వి. రమేష్ బాబు, ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.