హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల గుర్తింపుతో పాటు వారి కుటుంబాలకు సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల జ్యోతి ప్రాంగణంలో కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) విద్యార్థి ఉద్యమకారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడు పొన్నం ప్రభాకర్, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ ఎం. కోదండరాం (ఎంఎల్‌సీ), అద్దంకి దయాకర్ (ఎంఎల్‌సీ, ప్రభుత్వ విప్), ఎస్. రాములు నాయక్, శ్రీ మోతే శోభన్ రెడ్డి తదితరులు పాల్గొని కేయూ విద్యార్థి ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో విద్యార్థి ఉద్యమకారులు పలు కీలక సూచనలు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. కేవలం ఉద్యమకారుల గుర్తింపు కార్డులు జారీ చేయడానికే పరిమితం కాకుండా, ఉద్యమంలో భాగస్వాములైన వారి కుటుంబాలకు ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్య, నాణ్యమైన వైద్య సేవలు, గృహ సౌకర్యాలు, పెన్షన్, ఆర్థిక భద్రత వంటి అంశాల్లో సమగ్ర సంక్షేమ విధానాలు అమలు చేయాలని కోరారు. తెలంగాణ సాధన కోసం చేసిన త్యాగాలకు తగిన గుర్తింపు, శాశ్వత సామాజిక భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల విద్యార్థుల పాత్ర చారిత్రాత్మకమైందని పేర్కొన్నారు. ఉద్యమకారులకు కేవలం గుర్తింపు ఇవ్వడం మాత్రమే కాకుండా, వారి జీవితాల్లో సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే సంక్షేమ సంస్కరణలను రూపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. విద్యార్థి ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు అందించిన సూచనలు, ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి ఉన్నతస్థాయి కమిటీ నివేదికలో పొందుపరుస్తామని తెలిపారు. అనంతరం ఆ నివేదికను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఉద్యమకారుల కుటుంబాలకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, వివిధ ఉద్యమ సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.