హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న నిజమైన ఉద్యమకారుల గుర్తింపు మరియు వారి సంక్షేమమే ఆశయంగా ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ అధికారిక సమావేశాలు సచివాలయం ఎదురుగా ఉన్న “తెలంగాణ అమర జ్యోతి” ప్రాంగణంలో ముమ్మరంగా (Intensively) కొనసాగుతున్నాయి. నేటితో ఈ సంప్రదింపుల ప్రక్రియ విజయవంతంగా 3వ రోజుకు చేరుకుంది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు అధ్యక్షతన, కమిటీ సభ్యులు సమక్షంలో నేడు రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థి ఉద్యమకారులు మరియు అధ్యాపక ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈనాటి కీలక సమావేశంలో జేఎన్‌టీయూహెచ్ (JNTUH), తెలంగాణ యూనివర్సిటీ (Nizamabad), మహాత్మా గాంధీ యూనివర్సిటీ (Nalgonda), పాలమూరు యూనివర్సిటీ (Mahabubnagar), శాతవాహన యూనివర్సిటీ (Karimnagar), తెలుగు విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU), మరియు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాలు etc కు చెందిన మలిదశ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సామాజిక సంస్కరణల (Social Reforms) పై ప్రత్యేక దృష్టి:
సమావేశంలో పాల్గొన్న వివిధ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు కమిటీ ముందు తమ ఆకాంక్షలను, విలువైన సలహాలను ఉంచారు. ఉద్యమకారులను కేవలం రాజకీయాల కోణంలో కాకుండా పారదర్శకంగా గుర్తించాలని కోరారు. ముఖ్యంగా, కేవలం ఐడెంటిటీ కార్డుల జారీతో సరిపెట్టకుండా, ఉద్యమ సమయంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి విద్యా, వైద్య, ఆర్థిక రంగాల్లో విప్లవాత్మకమైన “సామాజిక సంస్కరణలు” (Social Reforms) తీసుకురావాలని, తద్వారా ఆయా కుటుంబాలకు శాశ్వత సామాజిక భద్రత కల్పించాలని గట్టిగా విజ్ఞప్తి చేశారు.
చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ:
“తెలంగాణ మలిదశ ఉద్యమ రథసారధులు మన విద్యార్థులు మరియు మేధావులు. 3వ రోజు ముమ్మరంగా జరిగిన ఈ సమావేశాలలో వివిధ వర్సిటీల నుండి వచ్చిన ప్రతినిధులు అత్యంత విలువైన ప్రతిపాదనలను, సామాజిక సంస్కరణల విజ్ఞాపనలను కమిటీకి అందించారు. రాజకీయాలకు అతీతంగా, నిఖార్సైన ప్రతి ఒక్క ఉద్యమకారుడిని గుర్తించి, గౌరవించడమే మా ప్రభుత్వ ప్రధాన సంకల్పం. ఈ రోజు సేకరించిన అన్ని నివేదికలను మరియు సామాజిక భద్రతా ప్రతిపాదనలను త్వరలోనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం. ఉద్యమకారుల త్యాగాలకు తగిన న్యాయం జరిగేలా కమిటీ తుది నివేదికను పారదర్శకంగా సిద్ధం చేస్తుంది.”
ఈ సమావేశంలో ఉన్నత స్థాయి కమిటీ సభ్యులైన: 1) ప్రొఫెసర్ ఎమ్. కోదండరాం (MLC), 2) అద్దంకి దయాకర్ (MLC & ప్రభుత్వ విప్), 3) ఎస్. రాములు నాయక్ (మాజీ ఎమ్మెల్సీ), 4) మోతే శోభన్ రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థి ఉద్యమకారులు పాల్గొన్నారు.